Electricity Charges Increase : కరెంటు ఛార్జీల పెంపు ఈ సారి భారీగానే ఉండనుంది. అయిదేళ్లుగా ఒక్కపైసా కూడా ఛార్జీ పెంచనందున నష్టాలు, ఆర్థికలోటు పెరిగిపోయాయని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రభుత్వానికి నివేదించాయి. ఒక్కో యూనిట్‌కు సగటున రూపాయి చొప్పున ఛార్జీలు పెంచితే తప్ప ఆర్థిక కష్టాలు తీరవని డిస్కంలు భావిస్తున్నాయి. యూనిట్‌కు 5 లేదా 10 పైసలు పెంచితే కష్టాలు తీరవని, సుదీర్ఘ కాలం తరవాత పెంచుతున్నందున ఆర్థికంగా చేయూతనిచ్చేలా పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సంస్థలు యోచిస్తున్నాయి.
Electricity Charges Increase in Telangana : ప్రస్తుత, వచ్చే ఏడాది కలిపి రూ.21,552 కోట్ల మేర ఆర్థికలోటు ఉంటుందని డిస్కంలు ప్రభుత్వానికి, ఈఆర్‌సీకి తెలిపాయి. ఇవి కాకుండా ఏటా రూ.6 వేల కోట్ల నష్టాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా సగటున 4 వేల కోట్ల యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు ప్రజలకు విక్రయిస్తున్నాయి. యూనిట్‌కు సగటున రూపాయి చొప్పున పెంచితే ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది. ప్రస్తుత ఛార్జీలను కొనసాగిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23) రూ.10,928 కోట్లు లోటు ఉంటుందని, యూనిట్‌కు రూపాయి చొప్పున ఛార్జీలు పెంచినా రూ.6,928 కోట్లు లోటు కొనసాగుతుందని అంచనా. ఛార్జీల పెంపును భారంగా భావించకుండా యూనిట్‌కు కనీసం రూపాయి చొప్పున పెంచేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందాక విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఇవ్వాలని డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి.