Central About Paddy Procurement : దేశంలో ఏ రాష్ట్రం నుంచీ కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరణను ఆపలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ అక్టోబరు నుంచి ప్రారంభమైందని, డిసెంబరు 8 వరకు కేంద్ర పూల్‌కు 326 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని పేర్కొంది. అత్యధికంగా పంజాబ్ నుంచి 186.86 ల.మె.ట., హరియాణా నుంచి 55.31 ల.మె.ట., తర్వాత తెలంగాణ నుంచి 32.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సెంట్రల్ పూల్‌కు సేకరించినట్లు తెలిపారు. బుధవారం లోక్‌సభలో తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి సమాధానాలు ఇచ్చారు.
Telangana in Parliament 2021 : ‘‘ఈ ఏడాది ఖరీఫ్‌లో తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని ఆగస్టు 17న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం 24.75 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు బియ్యాన్ని ఉప్పుడు బియ్యం రూపంలో ఎఫ్‌సీఐకి సరఫరా చేయడానికి, మిగిలిన బియ్యాన్ని ముడి బియ్యం రూపంలో అందించడానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది. తర్వాత చేసిన మరో విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో 20 లక్షల మెట్రిక్ టన్నులను ఉప్పుడు బియ్యం రూపంలో తీసుకోవడానికి అంగీకరించింది. అందులో భాగంగా భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని తెలంగాణ ప్రభుత్వం అక్టోబరు 4న లేఖ ఇచ్చింది.’’
- సాధ్వీ నిరంజన్ జ్యోతి, కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి