All Party Dharna at Indira Park: వానాకాలం ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద అఖిల పక్ష నేతలు రైతు ధర్మాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీక్షలో వామపక్షాలు, తెదేపా, తెజస, ఇంటి పార్టీల నాయకులు పాల్గొన్నారు.కేంద్ర సర్కార్.. గతంలో మాదిరి ధాన్యం కొనుగోలు చేయాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈసారి యాసంగి ధాన్యం కూడా కొనాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలని అన్నారు. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కనీస మద్దతు ధర ఇవ్వాలి..
All Party Dharna at Indira Park : రోజుల తరబడి ధాన్యం కల్లాల్లోనే ఉండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా గతంలో మాదిరి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న ఆయన.. పంటకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనాలని కోరారు.
తరుగు పేరుతో దోపిడీ..
"కొనుగోలు కేంద్రంలో విపరీతంగా దోపిడీ జరుగుతోంది. ప్రతి కేంద్రంలో హమాలీ, రవాణా ఖర్చులు రైతే భరిస్తున్నాడు. టార్పాలిన్లు కూడా కర్షకులే తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో వరి మాత్రమే ప్రధాన పంటగా మారింది. వరి తప్ప వేరే ఏ పంట పండించలేని పరిస్థితులు ఉన్నాయి. పారా బాయిల్డ్ రైస్ కొనమని చెబుతున్నారు.. ఇలా అయితే.. రాష్ట్రం నుంచి ఒక్క గింజ ధాన్యం కూడా కొనడానికి వీలుండదు."