పార్లమెంటులోని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 24 పార్లమెంటరీ స్థాయీ సంఘాలను(Parliamentary Committees) పునర్నియమిస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం బులెటిన్ విడుదలచేసింది. ఈ కమిటీలు సెప్టెంబరు 13వ తేదీ నుంచే అమల్లో ఉన్నట్లు పేర్కొంది.
పరిశ్రమలు, వాణిజ్య స్థాయీ సంఘాల ఛైర్మన్లుగా తెరాస, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు(TRS MP K.Keshava Rao), విజయసాయిరెడ్డి, రవాణా, పర్యాటకం, సాంస్కృతిక విభాగం స్థాయీ సంఘం ఛైర్మన్‌గా టి.జి.వెంకటేష్ నియమితులయ్యారు. వాణిజ్య సంఘంలో సభ్యులుగా తండ్రీకుమారులైన ధర్మపురి శ్రీనివాస్, ధర్మపురి అర్వింద్‌లను నియమించారు. సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, న్యాయ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా గతంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వ్యవహరించగా ప్రస్తుతం ఆ స్థానంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీని నియమించారు. ఇవి మినహా రాజ్యసభ, లోక్‌సభ కమిటీలకు పాత వారే ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. సామాజిక న్యాయం, సాధికారిత సంఘంలో తెలుగు ఎంపీలకు చోటు దక్కలేదు.