తెలంగాణ

telangana

ETV Bharat / city

Software Prashanth: ప్రేయసి కోసం పాక్​కి వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చి.. - ప్రశాంత్‌ కథ సుఖాంతం

ప్రేయసి కోసం పాక్‌కు వెళ్లి అక్కడి చెరసాలలో శిక్ష అనుభవించిన ప్రశాంత్‌ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరారు. శిక్ష పూర్తయినందున పాక్‌ అధికారులు భారత్‌కు అప్పగించగా... సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చొరవతో దిల్లీ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. స్వదేశానికి రప్పించేందుకు కృషిచేసిన తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని ప్రశాంత్‌ తెలిపారు.

telugu guy prashanth reached his family after 4 years from pakistan
telugu guy prashanth reached his family after 4 years from pakistan

By

Published : Jun 1, 2021, 5:36 PM IST

Updated : Jun 1, 2021, 5:49 PM IST

పాకిస్థానీయులు అంత చెడ్డవారేమీ కారు: ప్రశాంత్‌

ప్రియురాలి కోసం మూడేళ్ల క్రితం పాకిస్థాన్‌కు వెళ్లిన తెలుగు యువకుడు ప్రశాంత్​ ఎట్టకేలకు తమ కుటుంబాన్ని చేరుకున్నాడు. ఏపీలోని విశాఖకు చెందిన ప్రశాంత్‌... సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన పాక్‌ యువతి ప్రేమ కోసం 2017లో స్విట్జర్లాండ్‌ వెళతానని ఇంట్లో చెప్పి దాయాది దేశానికి పయనమయ్యాడు.

అక్రమంగా ప్రవేశించాడని...

రాజస్థాన్‌ బికనీర్‌ వరకు రైలులో వెళ్లిన ప్రశాంత్‌ సరిహద్దుల్లోని ఫెన్సింగ్‌ దూకి పాక్‌ భూభాగంలో అడుగుపెట్టారు. వీసా, పాస్‌పోర్ట్‌ లేవనే కారణంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చినందుకు పంజాబ్‌ ప్రావిన్స్‌లో ప్రశాంత్‌ను పాకిస్తాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఫెడరల్‌ దర్యాప్తు సంస్ధకు అప్పగించి విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాక్‌ భూభాగంలోకి ప్రవేశించారనే కారణంపై సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన ప్రశాంత్‌ను అరెస్టు చేసి నాలుగేళ్లుపాటు జైలులో వేశారు.

సజ్జనార్​ ప్రత్యేక చొరవతో...

ఈ సమయంలో కుటుంబసభ్యులు ప్రశాంత్‌ క్షేమ సమాచారంపై తల్లిడిల్లారు. తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్‌ సీపీతో పాటు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కుమారుడిని క్షేమంగా విడిపించేలా చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. ప్రశాంత్‌ను హైదరాబాద్‌ తీసుకురావడంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాలుగేళ్లపాటు శిక్ష అనుభవించిన ప్రశాంత్‌ ఇటీవలే కారాగారం నుంచి విడుదలయ్యారు. ప్రంజాబ్‌ ఫ్రావిన్సు సరిహద్దుల్లో భారత దౌత్యాధికారులకు అప్పగించగా...అక్కడి నుంచి మాదాపూర్‌ పొలీసులు క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సీపీ సజ్జనార్​... ప్రశాంత్​ను తమ కుటుంబసభ్యులకు అప్పగించారు.

మళ్లీ వస్తాననుకోలేదు...

తెలంగాణ ప్రభుత్వం, కేంద్రానికి ప్రశాంత్...​ ధన్యవాదాలు తెలిపాడు. రెండు ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని తెలిపాడు. తల్లిదండ్రుల మాటలు వినక మూర్ఖంగా ప్రవర్తించినందుకు నాలుగేళ్లు కుటుంబానికి దూరమయ్యానని ఉద్వేగానికి లోనయ్యాడు. తాను వెళ్లే ముందు తన అమ్మ ఆపేందుకు ప్రయత్నించిందని... అమ్మ మాటను పెడచెవినపెట్టినందుకు కష్టాల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.అసలు తిరిగి వస్తానని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే మళ్లీ తల్లిదండ్రులను చూడగలిగానని తెలిపాడు. నాలుగేళ్లలో హిందీ మాట్లాడటం నేర్చుకున్నట్లు వివరించాడు.

పాకీస్తానీలు చెడ్డవాళ్లేమీ కాదు...

తన సమస్యను భారత్‌-పాక్‌ మధ్య సమస్యగా చూడకూడదన్నాడు. రెండు దేశాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉన్నారని ప్రశాంత్‌ పేర్కొన్నాడు. పాకిస్థానీయులు అంత చెడ్డవారేమీ కారని తెలిపాడు. జైలులో భారతీయులతో పని చేయించరన్నాడు. కారాగారంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పుస్తకాలు చదువుకున్నాని తెలిపాడు. భారతీయుల కోసం జైలులో ప్రత్యేక గదులు ఉండేవని ప్రశాంత్​ వివరించాడు.

సంబంధిత కథనం: ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత

Last Updated : Jun 1, 2021, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details