తెలంగాణ

telangana

ETV Bharat / city

మహానాడు - 2 : ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు - నేడు యుగపురుషుడికి మహానాడు వేదికగా తెలుగుదేశం ఘన నివాళులు

తెలుగునాట అన్నా అన్న పదం ఆయన్ను చూసే పుట్టిందని భావిస్తారంతా. అశేష ఆంధ్రావనికి ఆ పేరే తారకమంత్రం. సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర రాజకీయాల్లో నందమూరి తారకరామారావుది ఒక శకం. ఆయన ప్రవేశం రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఆ మహానేత 98వ జయంతి సందర్భంగా యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులర్పించనుంది.

మహానాడు - 2 : ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు
మహానాడు - 2 : ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు

By

Published : May 28, 2021, 6:34 AM IST

నందమూరి తారక రామారావు.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరది. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింప చేసిన మహా నేత. తెలుగు నాట ప్రఖ్యాత నట సార్వభౌముడు ఎవరంటే ఎన్టీఆర్ పేరు మినహా మరెవరి పేరు వినపించదు. కాలే కడుపులకు పట్టేడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని ఆలోచించిన వాస్తవిక వాది. అందుకే సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లని నినదించారు. జనమే ఊపిరిగా రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బాటలు పరిచారు.

13 నెలల్లోనే అధికారం..

రాజకీయాల్లోకి వచ్చి పార్టీ ప్రారంభించిన 13 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా రెండు రూపాయాలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు, ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్​లో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింప చేసి, ఆ ఘనత పోందిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు.

4 ఎన్నికల్లో 3 సార్లు అధికారం..

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్​ది ఒక శకం. అయన ప్రవేశం రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఈ చైతన్యాన్ని నమ్ముకునే ఆయన తన రాజకీయ జీవితం చివరి వరకూ ధైర్యంగా నడవగలిగారు. అందుకే ఆయన పదమూడు ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. మూడుసార్లు విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

మహానాడు వేదికగా ఘన నివాళులు..

ఎన్టీఆర్​కు ప్రజల పాలనే తప్ప ఎమ్మెల్యేల పాలన తెలియదు కనుకే ప్రజా సేవకుడిగా నిలిచారు. సినీరంగంలోనూ ఆ పేరు ఓ నట విశ్వరూపం. తెలుగు లోగిళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్రవేశారు. నాలుగున్నర దశాబ్ధాల పాటు వెండితెర రారాజుగా నిలిచి 296 చిత్రాల్లో నటించారు. ఆ మహానేతకు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఘన నివాళులర్పించనుంది.

"తెలుగు ఆత్మగౌరవ ప్రతీక- సామాజిక న్యాయ ప్రదాత ఎన్టీఆర్​కు నివాళి " తొలి తీర్మానం

మహానాడు రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా "తెలుగు ఆత్మగౌరవ ప్రతీక- సామాజిక న్యాయ ప్రదాత ఎన్టీఆర్​కు నివాళి " పేరిట తొలి తీర్మానం చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు ప్రవేశపెట్టే ఈ తీర్మానాన్ని నందమూరి బాలకృష్ణ, ఎల్.రమణ, సాయిబాబా, పీఆర్ మోహన్​లు బలపరచనున్నారు.

బాలయ్య సర్​ప్రైజ్..

లెజెండరీ నటుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బాలయ్య. స్వయంగా ఆయనే పాడిన శ్రీరామ దండకాన్ని విడుదల చేయనున్నారు.

మొత్తం 10 తీర్మానాలు..

రెండో రోజు ఏపీకి సంబంధించి 4 తీర్మానాలు చేయనుండగా తెలంగాణకు సంబంధించి 3 తీర్మానాలు సహా మరో 3 తీర్మానాలు ఉమ్మడిగా కలిపి మొత్తం 10 తీర్మానాలు చేయనున్నారు. ఏపీకి సంబంధించి నత్త నడకలో సాగునీటి ప్రాజెక్టులు - కుదేలైన వ్యవసాయం, మోసకారి సంక్షేమం - నకిలీ రత్నాలు, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం - బిల్లులు పెండింగ్, ప్రత్యేక హోదాపై మోసం తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. తెలంగాణకు సంబంధించి ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య - ఉపాధి అవకాశాలు - పరిశ్రమల మూసివేత - కుదేలైన విద్యారంగం, కొరవడిన మహిళా వికాసం అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఎన్టీఆర్​కు నివాళితో పాటు పార్టీ సంస్థాగత తీర్మానంతో పాటు రాజకీయ తీర్మానాలు ఉమ్మడిగా ఉండనున్నాయి.

ఇవీ చూడండి :బడ్జెట్ కేటాయింపుల్లో సర్దుబాటుపై ఆర్థికశాఖ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details