సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ... ఇవాళతొలి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పద్దు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. ఇరు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు చేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపైనా కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారంలో ఉక్కుకర్మాగారం, ఖాజీపేటలో రైల్వేకోచ్ ప్యాక్టరీ తదితరాల ఊసే లేదు. బడ్జెట్ పూర్తి స్థాయిలో నిరాశాజనకంగానే ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
వడ్డి రాయితీ ఏదీ
రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాగా కేంద్రం నుంచి 19వేలా 719కోట్ల రూపాయలు రానున్నాయి. 2018-19 సవరించిన బడ్జెట్లో ఈ మొత్తం 18వేలా 561 కోట్ల రూపాయలు. అంటే కేవలం 1,157 కోట్లు మాత్రమే ఎక్కువ. ఇదే సమయంలో కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొన్న పన్నుల వాటా కంటె 864కోట్ల రూపాయలు తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే పారిశ్రామిక యూనిట్లకు ఇచ్చే వడ్డి రాయితీని ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించలేదు. గతేడాది రెండు తెలుగురాష్ట్రాలకు కలిపి రూ.100 కోట్లు ప్రతిపాదించినా అంచనాల సవరణ నాటికి దక్కింది మాత్రం శూన్యమే.
విద్యాలయాలకు తక్కువే
తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి 4 కోట్లు కేటాయించారు. ఇందులో కూడా రుణం, వడ్డీ చెల్లింపు కోసం 25 లక్షల రూపాయలు ప్రతిపాదించారు. గతేడాది 10 కోట్ల రూపాయలు కేటాయించినా అంచనాల సవరణ నాటికి అది 50 లక్షలకే పరిమితమైంది. హైదరాబాద్ ఐఐటీకి 80 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. గతేడాది 75 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ నాటికి ఏమీ ఇవ్వలేదు. హైదరాబాద్లోని అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ఫ్లోరేషన్ అండ్ రీసెర్చికి 319 కోట్లు కేటాయించారు.