తెలంగాణ

telangana

ETV Bharat / city

జీఎస్టీ పరిహారం విషయంలో మిగతా రాష్ట్రాల బాటలోకి తెలంగాణ - తెలంగాణ జీఎస్టీ వార్తలు

gst
gst

By

Published : Nov 17, 2020, 7:30 PM IST

Updated : Nov 17, 2020, 10:09 PM IST

19:29 November 17

జీఎస్టీ పరిహారం విషయంలో మిగతా రాష్ట్రాల బాటలోకి తెలంగాణ

జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆప్షన్‌-1 ఎంచుకునే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఈ జాబితాలో రాజస్థాన్‌ చేరగా.. ఇప్పుడు తెలంగాణ కూడా చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు సమాచారం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఆప్షన్‌ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి జీఎస్టీ పరిహారం కింద రూ.2,380 కోట్లు అందనున్నాయి.  

ఇదే ఆప్షన్‌ ఎంచుకున్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎంలో ఇచ్చిన మినహాయింపులు, సడలింపుల వల్ల బహిరంగ మార్కెట్‌ నుంచి అదనంగా రూ.5,017 కోట్ల రుణం తీసుకోవడానికి వెసులుబాటు కలగనుంది. ఆప్షన్‌-1 ఎంచుకున్న జాబితాలో ఇప్పటికే 21 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు చేరగా.. ఇటీవల రాజస్థాన్‌ కూడా చేరడంతో 22కు చేరిన సంఖ్య ఇప్పుడు తెలంగాణ చేరడంతో 23కి పెరిగింది. ఆప్షన్‌-1 పద్దు కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.18వేల కోట్ల రుణం తీసుకుని 2 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు పరిహారం కింద పంపిణీ చేసింది.  

అక్టోబర్ 23, నవంబర్‌ 2, 9 తేదీల్లో కేంద్రం.. ఒక్కో దఫాలో రూ.6 వేల కోట్ల చొప్పున రుణం తీసుకుని రాష్ట్రాలకు పంచగా.. నవంబర్ 23న నాలుగో విడత రుణం తీసుకుని అందించేందుకు సిద్ధమైంది. నాలుగో దఫాలో తెలంగాణకు రూ.2,380 కోట్లు దక్కనున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం కింద ఎలాంటి షరతులు లేకుండా 0.5 శాతం అదనపు రుణం తీసుకునేందుకు వెసులుబాటు లభించడం వల్ల బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.5017 కోట్లు అదనంగా సమీకరించుకోవడానికి వీలు ఏర్పడింది.  

Last Updated : Nov 17, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details