తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2020, 7:01 AM IST

ETV Bharat / city

మా అభ్యంతరాలను పట్టించుకోరా? : తెలంగాణ జలవనరుల శాఖ

బోర్డుల పరిధికి సంబంధించిన ముసాయిదాను ఏకపక్షంగా కేంద్రానికి ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తూ తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు. తమ అంగీకారం లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని అందులో ప్రశ్నించినట్లు తెలిసింది.

Telangana Water Resources Department
తెలంగాణ జలవనరుల శాఖ

తమ అంగీకారం లేకుండా బోర్డుల పరిధిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తూ తెలంగాణ జలవరుల శాఖ ఇంజినీర్ చీఫ్ మురళీధర్.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌కు సంబంధించిన వాటానే ఇంకా ఖరారు కాలేదని, ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి కేటాయింపు అనేది లేకుండా పరిధిని ఖరారు చేసి ఏం ప్రయోజనమని పేర్కొన్నట్లు తెలిసింది. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా పరిధికి సంబంధించిన ముసాయిదా మినిట్స్‌ను కేంద్రానికి పంపించారని, ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ రెండు రోజుల క్రితం బోర్డులకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ లేఖ రాశారు. ఏకపక్షంగా ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తూ బుధవారం మరో లేఖ రాశారు.

ఇదీ నేపథ్యం:

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు 2014లో ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వాటి పరిధిపై బోర్డు సమావేశాల్లో చర్చ జరుగుతోంది. 2018లో పరిధికి సంబంధించిన ముసాయిదాను ఖరారు చేశారు. తెలంగాణ అభ్యంతరంతో అది పెండింగ్‌లో పడింది. ఇటీవల అపెక్స్‌ కౌన్సిల్‌ సందర్భంగా దీనిపై చర్చ జరిగింది. రాష్ట్రాలు అంగీకరించకపోయినా పరిధిని నోటిఫై చేస్తామని కేంద్ర జల్‌శక్తి మంత్రి ప్రకటించారు. దీంతో పరిధి ఎలా ఉండాలన్న దానిపై కృష్ణా, గోదావరి బోర్డులు కసరత్తు ప్రారంభించాయి. గతంలో ఖరారు చేసిన ముసాయిదాలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇతర బోర్డులు ఎలా పని చేస్తున్నాయో కూడా పరిశీలించారు. ప్రాజెక్టులను మూడు గ్రూపులుగా విభజించి ఏ ప్రాజెక్టులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలో, వేటిని మానిటరింగ్‌ చేయాలో అనే వాటితోపాటు పలు అంశాలపై చర్చించి తుది దశకు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బోర్డులకు లేఖ రాశారు.

తుంగభద్రపై రెండు కొత్త పథకాలు

తుంగభద్రలో పూడిక వల్ల కోల్పోయిన నీటితో పాటు వరదనీటి వినియోగానికి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రెండు భారీ పథకాలను ప్రతిపాదించాయి. రూ.6వేల కోట్లతో తుంగభద్ర కుడి ప్రధాన కాలువకు సమాంతరంగా కాలువ, రిజర్వాయర్‌ నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదించగా, తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌(హెచ్‌ఎల్‌సి)కు సమాంతరంగా వరదకాలువ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించింది. రెండు దశాబ్దాలకు పైగా వరద కాలువ ప్రతిపాదన ఉన్నా, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ దీన్ని తిరస్కరించడంతో ఆగిపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై గురువారం జరిగే తుంగభద్ర బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కలిపి 230 టీఎంసీల కేటాయింపు ఉంది. అయితే పూడిక పెరిగి 1976-77 నుంచి 2019-20 వరకు 60 టీఎంసీల మేర వాడుకోలేకపోయామని రెండు రాష్ట్రాలు చెప్పాయి.

కర్ణాటక ప్రతిపాదన ఇదీ

తుంగభద్ర కుడి ప్రధాన కాలువకు సమాంతరంగా 22,787 క్యూసెక్కుల సామర్థ్యంతో (రోజుకు 2 టీఎంసీలు) 38 కి.మీ. దూరం కాలువ తవ్వి నవళి దగ్గర 30.2 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించడం. అవసరమైతే 50 టీఎంసీల వరకు పెంచుకునేలా ప్రతిపాదన. ఇందుకోసం 22,220 ఎకరాల భూసేకరణ చేయాల్సి వస్తుందని, మొత్తం రూ.6వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదన..

తుంగభద్ర హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ నిర్మించి 20 రోజుల్లో 25 టీఎంసీలు మళ్లించి రెండు రాష్ట్రాలు వినియోగించుకోవడం. 12వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా కాలువ సామర్థ్యం. 200 కి.మీ. కాలువ తవ్వాలి. ఇందులో కర్ణాటకలో 104 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 96 కి.మీ. ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details