తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2021, 6:50 AM IST

ETV Bharat / city

Employees Transfer Telangana : జిల్లా స్థాయుల్లో 100% ఉద్యోగుల చేరిక

Employees Transfer Telangana : తెలంగాణలో కొత్త జోనల్​ విధానం అమల్లో భాగంగా జిల్లా స్థాయిలో కేటాయించిన ఉద్యోగులు తమకు నిర్దేశించిన జిల్లాల్లో రిపోర్ట్ చేశారు. రిపోర్టు చేసిన 56వేల మంది ఉద్యోగుల కొత్త పోస్టింగులపై ఈనెల 25 లేదా 26న ఉత్తర్వులు జారీ కానున్నాయి. విధుల్లో చేరేందుకు వారం రోజుల గడువును ఇస్తారు.

Employees Transfer, ఉద్యోగుల బదిలీలు
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు

Employees Transfer Telangana : రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం అమలులో భాగంగా జిల్లా స్థాయుల్లో కేటాయించిన ఉద్యోగులు వంద శాతం తమకు నిర్దేశించిన జిల్లాల్లో రిపోర్ట్‌ చేశారు. గురువారం రాత్రి వరకు ఈ ప్రక్రియ ముగిసింది. శని లేదా ఆదివారం వారి కొత్త పోస్టింగులపై ఉత్తర్వులు జారీ కానున్నాయి. గతంలో ఆర్డర్‌ టు సర్వ్‌ విధానంలో బదిలీ అయిన ఉద్యోగులను తాజాగా కొత్త జోనల్‌ విధానం కింద సొంత జిల్లాలకు కేటాయించింది. దీనికి అనుగుణంగా గత మూడు రోజులుగా ఆయా ఉద్యోగులు జిల్లాల్లో కలెక్టర్లు, ఉన్నతాధికారుల వద్ద రిపోర్టు చేశారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల వరకు జిల్లాల్లో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. రిపోర్ట్‌ చేసిన మొత్తం 56 వేల మంది ఉద్యోగుల జాబితాకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో ఖాళీ స్థానాలను కలెక్టర్లు, ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించి, శనివారం నుంచి కొత్త పోస్టింగులు ఇస్తారు. విధుల్లో చేరేందుకు వారం రోజుల గడువునిస్తారు.

జోన్లు, బహుళ జోన్లలో కేటాయింపులు నేటితో పూర్తి

Telangana Employees Transfer : జోనల్‌, బహుళజోనల్‌ స్థాయిలో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ శుక్రవారం ముగియనుంది. గత వారం రోజులుగా ఇది సాగుతోంది. ఇతర జోన్లలో ఉన్న వారిని సొంత జోన్లకు కేటాయిస్తూ కసరత్తు జరుగుతోంది. మరో రెండు శాఖలు మిగిలి ఉండగా వాటిలో కేటాయింపులు శుక్రవారం పూర్తిచేస్తారు. శనివారం మొత్తం కేటాయింపుల జాబితాను ప్రభుత్వ ఆర్థికశాఖ పోర్టల్‌ ఐఎఫ్‌ఎంఐఎస్‌లో చేరుస్తారు. ఆ వెంటనే జోనల్‌, బహుళజోనల్‌ ఉద్యోగులు, అధికారులకు సంక్షిప్త సందేశాలతో కూడిన ఉత్తర్వులు వస్తాయి. వాటి ఆధారంగా మూడు రోజుల వ్యవధిలో వారు శాఖాధిపతులు, ముఖ్యకార్యదర్శుల వద్ద రిపోర్ట్‌ చేయాలి. అందరూ రిపోర్ట్‌ చేసిన తర్వాత వారికి కొత్త పోస్టింగులు ఇస్తారు.

‘పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలి’

New Zonal System Telangana : కొత్త జోనల్‌ విధానంలో భాగంగా చేపట్టిన కేటాయింపులు, బదలాయింపుల అనంతరం కొత్త పోస్టింగుల్లో చేరిన వారిని అప్పీళ్లకు, భార్యాభర్తల బదిలీలకు వెసులుబాటు కల్పించడంపై ఉద్యోగసంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే టీఎన్జీవో, టీజీవో నేతలు మామిళ్ల రాజేందర్‌, మమత, ప్రతాప్‌, సత్యనారాయణ, పీఆర్‌టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెళ్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు కొత్త స్థానాల్లో చేరిన తర్వాత ఉద్యోగులకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. దీనిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని సీఎస్‌ హామీ ఇచ్చారు.

జిల్లాలు మారిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు!

Telangana New Zonal System : కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించిన నేపథ్యంలో జిల్లాలు మారిన వారికి కొత్త జిల్లాలో పోస్టింగ్‌లు ఇస్తారని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 25 వేల మందిని పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు కేటాయించారు. వారిని మూడు రోజుల్లో కొత్త జిల్లాల్లో రిపోర్ట్‌ చేయమన్నారు. రిపోర్ట్‌ చేసిన తర్వాత ఎక్కడ పనిచేయాలన్న ప్రశ్న ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వొచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లో ఉన్న వారు అదే పాఠశాలలో పనిచేస్తారని, జిల్లాలు మారిన వారికి మాత్రం కొత్త జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యా సంవత్సరం ముగిసే వరకు పాత స్థానంలోనే ఉపాధ్యాయులు ఉంటే సమస్యలు వస్తాయని, న్యాయపరమైన కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జిల్లాలు మారిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడంపై మార్గదర్శకాలు జారీ చేయనుంది. జిల్లాలు కేటాయించినప్పుడు తీసుకున్న సీనియారిటీ ఆధారంగానే కౌన్సెలింగ్‌ నిర్వహించి పాఠశాలలు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్గదర్శకాలు ఎప్పుడైనా రావొచ్చని, అప్రమత్తంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన గురువారం రాత్రి డీఈవోలకు చెప్పినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details