సహజమైన అటవీ అందాలతో పాటు... వరంగల్ ఖిల్లా, తోరణాలు, వేయి స్తంభాల ఆలయం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట, నల్గొండలోని నాగార్జునకొండ ఇలా అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు తెలంగాణ నెలవు. భద్రాచలం రామయ్య, యాదాద్రి నరసింహుడు, వేములవాడ రాజన్న, గద్వాల జోగులాంబ ఇలా అనేకమైన ప్రవిత్ర ఆలయాలు కొలువైన ప్రాంతం తెలంగాణ. కుంటాల జలపాతం, అనంతగిరులు పచ్చదనం కలగలిసి అన్ని రకాల పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకే ఏటా సుమారు రూ.80 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కరోనా ప్రభావంతో రాబడికి భారీగా గండి పడింది.
నాడు కళకళ..
2019 జనవరి నుంచి డిసెంబర్ వరకు 8,30,35,894 మంది తెలంగాణను సందర్శించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో అత్యధికంగా జూన్లో 1,59,13,901 మంది పర్యటించారు. జనవరిలో 17,82,269, ఫిబ్రవరిలో 64,56,354, మార్చిలో 68,24,552, ఏప్రిల్ 58,02,032, మేలో 53,62,112, జూలైలో 45,98,041 మంది, ఆగస్టులో 50,10,596, సెప్టెంబర్లో 47,42,109, అక్టోబర్లో 52,02,274, నవంబర్లో 58,36,604, డిసెంబర్లో 65,05,050 మంది పర్యటించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో దాదాపు 30 శాతం మంది విదేశీయులున్నట్లు పేర్కొన్నారు.