భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. మే 22 వరకు దేశవ్యాప్తంగా యాసంగికి సంబంధించి 83.01 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా... ఒక్క తెలంగాణలోనే 52.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎఫ్‌సీఐ ప్రకటించింది.
తెలంగాణలో ఏడాది మొత్తం మీద 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ... కేవలం ఈ సీజన్లోనే సగం కంటే ఎక్కువ కొనుగోలు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన అనంతరం తెలంగాణ నుంచి 13 లక్షల టన్నుల బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ్ బంగ, ఝార్ఖండ్ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది.
ఎఫ్‌సీఐ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రైతులను సీఎం కేసీఆర్ అభినందించారు.