రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించుకోనుంది. మంగళవారం ఆర్‌బీఐ ద్వారా విక్రయించనుంది. తాజాగా 21, 22, 23 ఏళ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్ల చొప్పున రూ.మూడు వేలకోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బాండ్లను వేలం వేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో బాండ్ల అమ్మకం ద్వారా రూ.7,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. బాండ్ల విక్రయం ద్వారా రుణ సమీకరణపై కేంద్ర ఆర్థికశాఖ ఈ ఆర్థిక సంవత్సర ఆరంభంలోనే నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలో విక్రయానికి అనుమతి లభించలేదు. జూన్ నెలలో తాత్కాలిక ప్రాతిపదికగా కేంద్ర ఆర్థికశాఖ అనుమతించడంతో.. మొదటి వారంలో రూ.4,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించింది. జూన్ చివరి వారంలో మరో రూ.3,000 కోట్లు సేకరించింది.
కేంద్రంతో కొనసాగుతోన్న సంప్రదింపులు..2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెట్ వెలుపలి రుణాలు (కార్పొరేషన్ అప్పులు) కూడా ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం(ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) పరిధిలోని అప్పులుగా పరిగణిస్తామని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బాండ్ల వేలం ద్వారా తీసుకునే మార్కెట్ రుణాల మొత్తంపై స్పష్టత రాలేదు.
కేంద్ర నిర్ణయం కోసం రాష్ట్రం వివిధ ప్రతిపాదనలు చేసింది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. కార్పొరేషన్ల రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురావడాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడం... లేదంటే గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్న కార్పొరేషన్ల రుణాలను రానున్న నాలుగేళ్లకు సమంగా విభజించి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని నిర్ణయించడం. ఈ అంశాలపై స్పష్టత రాకపోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది.
మరోపక్క రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక ప్రాతిపదికగా బాండ్ల విక్రయానికి కేంద్రం అనుమతించడంతో మార్కెట్ రుణాలను సమకూర్చుకోగలుగుతోంది. వచ్చే మంగళవారం రూ.మూడు వేల కోట్ల విలువైన బాండ్ల వేలంతో రాష్ట్రం రూ.10 వేలకోట్ల కొత్త రుణాన్ని సమకూర్చుకున్నట్లవుతుంది. ఈ ఏడాది పూర్తి స్థాయి రుణాలపై స్పష్టత వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.