తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా కట్టడికి అహోరాత్రులు కష్టపడుతున్నాం: సీఎం కేసీఆర్ - సీఎం కేసీఆర్ వార్తలు

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అహోరాత్రులు కష్టపడుతున్నామని శాసనసభలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఐఏఎస్​ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుతోపాటు అవసరమైతే కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చే అంశం పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలిస్తే ఎలాంటి భేషజాలు లేకుండా ఆహ్వానిస్తామన్నారు.

cm kcr
cm kcr

By

Published : Sep 9, 2020, 9:50 PM IST

కరోనా కట్టడికి అహోరాత్రులు కష్టపడుతున్నాం: సీఎం కేసీఆర్

కొవిడ్‌ మహమ్మారి కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నట్లు శాసనసభకు ప్రభుత్వం తెలిపింది. శాసనసభలో వైరస్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా తొలుత మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వివరించారు. ప్రపంచఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్​ నిబంధనల ప్రకారం కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల సంఖ్యపెంపుతో పాటు కరోనా యోధులకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

యోధులకు గుర్తింపు దక్కలేదు

అనంతరం చర్చలో పాల్గొన్న మజ్లిస్‌.. ప్రభుత్వ ప్రకటనలో కరోనాకు సంబంధించిన చాలా అంశాలు ప్రస్తావించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం ప్రాణాలకు ఎదురొడ్డి సేవలందించిన యోధులకు గుర్తింపు దక్కలేదని ఆ పార్టీ సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఆక్షేపించారు. ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. తమ పార్టీ తరఫున లక్ష ఆహార ప్యాకెట్లు సరఫరా చేసినట్లు వివరించారు. సమాజంలోని అన్ని రంగాలను కరోనా ప్రభావితం చేసిందని అక్బరుద్దీన్‌ అన్నారు.

సౌకర్యాలు లేవు

కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోగా... కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టలేక పోయారని విమర్శించారు. వైరస్‌ కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఆరోగ్యశ్రీలో చేర్చే అంశం పరిశీలిస్తాం

విపక్ష సభ్యుల సలహాలు పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. కొవిడ్‌ సాయం కింద కేంద్రం నుంచి వచ్చింది శుష్కప్రియాలు, శూన్యహస్తాలే అని విమర్శించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఐఏఎస్​ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుతోపాటు అవసరమైతే కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చే అంశం పరిశీలిస్తామన్నారు.

ఆర్థికంగా అండగా ఉంటాం

కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ఉన్నంతలో ఆర్థికంగా అండగా ఉంటామన్నారు. వైరస్‌ మరణాలు దాచేస్తే దాగేవి కావని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు, సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రాజకీయంగా ఎవరు ఏం మాట్లాడినా నమ్మొద్దన్న ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని శాసనసభ వేదికగా ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details