Telangana Teachers Protest : ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జిల్లాలు, మల్టీ జోన్లు కేటాయించినా వారి ఆందోళనలు, ధర్నాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు సోమవారం ఏకంగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంటి ఆవరణలో ధర్నాకు దిగగా.. భార్యాభర్తల విభాగం ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనను కలిసి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. బహుళ జోన్‌లోకి మళ్లిన వారిని మళ్లీ కోరుకున్న జోన్‌కు మార్చాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళతానని సంచాలకురాలు హామీ ఇచ్చారు. మరోవైపు సీనియారిటీ, తప్పుల సవరణ, భార్యాభర్తల విభాగంపై ఇంకా వందల అర్జీలు వస్తుండటంతో వాటినీ పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నుంచే 40 వరకు అప్పీళ్లు అందాయి.
విద్యాశాఖ కార్యదర్శిని తప్పించాలంటూ..
Teachers Protest in Telangana : భారీసంఖ్యలో మల్టీ జోన్లలో ఖాళీలున్నా.. కుటుంబాలను గోస పెట్టేలా అధ్యాపకులను అటుఇటు మార్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను తప్పించాలంటూ ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విద్యామంత్రి సబిత ఇంటి ఆవరణలో అధ్యాపకులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని, అధ్యాపకుల మల్టీ జోనల్ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని నినదించారు. సంఘం ఛైర్మన్ డా.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ వితంతువులని కూడా చూడకుండా సుదూర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారని విమర్శించారు. విద్యాశాఖ కార్యదర్శి ఘనకార్యాలు అన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అధ్యాపకుల వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో అధ్యాపకులు కమిషనర్ జలీల్‌ను కూడా ఘెరావ్ చేశారు.