ఎంసెట్‌లో మాత్రం కనీస మార్కులు తెచ్చుకోవడం తప్పనిసరి. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనలను సడలిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం జీవో జారీ చేశారు. ఈసారి ఇంటర్ రెండో ఏడాదిలో ఉత్తీర్ణులవని వారికి కరోనా కారణంగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించడం వీలుకాదని భావించిన ప్రభుత్వం.. వారికి 35 శాతం మార్కులు ఇచ్చి కంపార్ట్‌మెంటల్‌లో ఉత్తీర్ణులైనట్లుగా ధ్రువపత్రాలు ఇచ్చింది.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠంలో ప్రవేశాలు పొందిన 30,733 మంది ఇంటర్ విద్యార్థులకు కూడా కొవిడ్ వల్ల పరీక్ష నిర్వహించలేకపోయారు. వారందరినీ 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులను చేస్తూ గత జులై 24న జీవో జారీ చేశారు. ఎంసెట్‌లో ర్యాంకు కేటాయించాలంటే ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. తమకు సప్లిమెంటరీ పరీక్షలైనా జరపండి లేదా ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేలా చూడండి అని కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వం నిబంధనలు మార్చి, ఇంటర్‌లో కనీస మార్కులతో ఉత్తీర్ణులైతే వారిని కూడా కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధన ఈ ఒక్క విద్యా సంవత్సరానికే వర్తిస్తుందని, తర్వాతి విద్యాసంవత్సరానికి వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండు రోజుల్లో ఎంసెట్ ర్యాంకులు
ఇంటర్‌లో 45 శాతం మార్కులు లేక, ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో కనీస మార్కులు సాధించినా ర్యాంకులు పొందలేకపోయిన వారు 333 మంది ఉన్నట్లు ఎంసెట్ అధికారులు గుర్తించారు. తాజా జీవో నేపథ్యంలో వారికి శనివారం నాటికల్లా ర్యాంకులు కేటాయిస్తామని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ చెప్పారు. దీని ప్రకారం వారు చివరి విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కలగనుంది.
‘విద్యాపీఠం’ విద్యార్థులకూ ఊరట
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ సొసైటీ) ద్వారా 35 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులై, నీట్, ఎంసెట్, లాసెట్ తదితర కౌన్సెలింగ్‌లకు అర్హత సాధించిన విద్యార్థులకు తగినంత కనీస మార్కుల శాతం ఉన్నట్లుగానే ఈ విద్యాసంవత్సరం భావిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యాపీఠం ఇంటర్ విద్యార్థులకు ఊరట కలిగినట్లైంది. ఎంసెట్ మాత్రమే కాకుండా నీట్, లాసెట్ తదితర కౌన్సెలింగ్‌కు అనుమతించాలని గతంలోని జారీ చేసిన జీవోను సవరించి తాజాగా మరోసారి జీవో ఇచ్చారు.
లాసెట్‌కు ఎలా?
లాసెట్‌లో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్ విద్యార్థులు అర్హులు. ఆ కోర్సులో ప్రవేశించాలంటే ఇంటర్‌లో ఓసీలకు 45 శాతం, ఓబీసీలకు 42, ఎస్‌సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో తప్పిన వారికి ఆ సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు వేసి ఉత్తీర్ణులను చేసింది. దానివల్ల తాము లాసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కోల్పోతామని విద్యార్థులు పేర్కొంటే ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
రేపటి నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంసెట్ ప్రవేశాల కమిటీ సవరించిన కౌన్సెలింగ్ కాలపట్టికను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇంటర్‌లో 35 శాతం మార్కులు వచ్చిన వారినీ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇస్తూ విద్యాశాఖ జీవో ఇచ్చే వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ను ఆపాలని హైకోర్టు బుధవారం ఆదేశించిన సంగతి తెలిసింది. గురువారం మొదలవ్వాల్సిన ఆ ప్రక్రియను నిలిపివేశారు. ప్రభుత్వం గురువారం జీవో జారీ చేయగా శనివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 50,288 మందికి సీట్లు కేటాయించగా గురువారం రాత్రి 7.30 గంటల వరకు(అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు ఉంది) 37,400 మంది మాత్రమే ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.