తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2022, 5:54 AM IST

ETV Bharat / city

Students in Ukraine: యుద్ధభూమిలో తెలుగు విద్యార్థులు.. భయం గుప్పిట్లో బతుకులు..

Students in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో... అక్కడ చదువుకుంటున్న రాష్ట్ర విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు.. ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. యుద్ధప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్న వారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.... రాజధాని కీవ్‌తోపాటు పరిసరాల్లో ఉన్న విద్యార్థులు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.

telangana Students stuck in Ukraine due to Russia war
telangana Students stuck in Ukraine due to Russia war

యుద్ధభూమిలో తెలుగు విద్యార్థులు.. భయం గుప్పిట్లో బతుకులు..

Students in Ukraine: ఉక్రెయిన్‌లో రష్యా కొనసాగిస్తున్న దాడుల కారణంగా భీకర వాతావరణం నెలకొంది. రాజధాని కీవ్‌తో పాటు పలు కీలక నగరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయా నగరాల్లోని జనాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన రాష్ట్ర విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి భయానక పరిస్థితులను ఇక్కడి కుటుంబసభ్యులకు వివరిస్తూ... తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఉక్రెయిన్‌ నుంచి తమ పిల్లలను భారత్‌కు రప్పించాలంటూ.... వారి కుటుంబసభ్యులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తిండి కూడా లేకుండా..

మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడకు చెందిన వేముల కీర్తి ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్​ చదువుతోంది. భయానక పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఓ మెట్రోస్టేషన్‌లో తినడానికి తిండి కూడా లేకుండా గడుపుతున్నట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ ఉక్రెయిన్‌లో చిక్కుకోవడంతో తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా తమ కుమారుడిని దేశానికి వచ్చేలా ప్రభుత్వాలు చూడాలని తండ్రి నర్సింహులు కోరుతున్నారు.

మరికొన్ని రోజుల్లో వద్దామని..

మెదక్‌కు చెందిన రాగం మధు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఎంబీబీఎస్​ అభ్యసిస్తున్నాడు. ఫైనల్‌ ఇయర్ చదువుతున్న మధు... మరికొన్ని రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నాడని.. ఇంతలోనే ఇలా యుద్ధంలో చిక్కుకుపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తలదాచుకునేందుకు స్థలం లేక..

ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం మెడిదపల్లిపాలెం గ్రామానికి చెందిన రావుల మహేశ్‌రెడ్డి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఉక్రెయిన్‌కు వెళ్లి అక్కడే చిక్కుకున్నాడు. తమ పరిస్థితి దారుణంగా ఉందని వీడియో పంపడంతో... తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

"గురువారం రాత్రి ఒడిశాలో క్లిష్ట పరిస్థితులు ఉండటంతో.. రైల్లో లెవీకి తరలివచ్చాం. ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం ఉందన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. ఇక్కడ తలదాచుకోవడానికి కూడా స్థలం లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. కనీసం క్యాబ్​లు కూడా నడవడం లేదు. దాదాపు 300 మంది వరకు ఇక్కడే చిక్కుకుపోయాం. ఈ విషయంపై ఇండియన్​ ఎంబసీ స్పందించి.. మమ్మల్ని త్వరగా స్వదేశానికి తరలించాలని వేడుకుంటున్నాం." -మహేశ్​, బాధితుడు

అక్కడ పరిస్థితి కాస్త మెరుగ్గానే..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు కీలక నగరాల్లో పరిస్థితి భయానకంగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దుష్యంత్... ఇవానో ఫ్రాంక్ విస్క్ నేషనల్ మెడికల్ వర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు. ప్రస్తుతం అక్కడ తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపాడు. ఎటీఎంలు, దుకాణాలు తెరిచే ఉన్నాయని చెప్పాడు.

ఇబ్బందులు ఏమీ లేవు..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన జనగాని విశాల్ కిరణ్ కూడా తాను క్షేమంగానే ఉన్నట్లు, ఇబ్బందులు ఏమీ లేనట్లు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. అధికారుల సూచన మేరకు స్నేహితులతో గదిలోనే ఉంటున్నట్లు చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత దిగజారకపోతే తమ పిల్లలను స్వస్థలాలకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details