Telangana Students in Ukraine : ఉక్రెయిన్ నుంచి మరో 120 మంది తెలంగాణ విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన మొత్తం విద్యార్థుల సంఖ్య 377కి పెరిగింది. దిల్లీ నుంచి 17 విమానాల ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న విద్యార్థులకు సాధారణ పరిపాలన శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వమే వాహనాలు సమకూర్చి వారిని ఇళ్లకు చేర్చింది.
ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులకు మంత్రి సబిత భరోసా..
Students Arrived in Telangana From Ukraine : ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ నగరంలో చిక్కుకుపోయిన.. ఇద్దరు రాష్ట్ర విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధైర్యం చెప్పారు. హైదరాబాద్ శివారు జల్‌పల్లి మున్సిపాలిటీ షాహీన్ నగర్‌కు చెందిన.. మసిహుద్దీన్ కుమార్తె సుమయ్యా.. కుమారుడు జావేద్‌లు ఖర్కీవ్‌లోని బంకర్లలో తలదాచుకున్నారు. వారితో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని భరోసా కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా ఖర్చు లేకుండా ఇంటికి చేర్చటానికి కృషి చేస్తామని చెప్పారు.
ఎటుచూసినా బాంబుల మోతే..
Telangana Students Arrived From Ukraine : మరోవైపు ఉక్రెయిన్ నుంచి రాష్ట్ర విద్యార్థుల రాక కొనసాగుతూనే ఉంది. కామారెడ్డికి చెందిన వైద్య విద్యార్థి అన్వేష్ ఉక్రెయిన్ నుంచి అతికష్టం మీద బుడాపేస్ట్ చేరుకుని అక్కడి నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బీడీ కాలనీకి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని భవాని ఎట్టకేలకు ఇంటికి చేరుకుంది. యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశామని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్కీవ్‌లో రోజంతా బాంబుల మోత ఎప్పుడు ఎమీ జరుగుతుందో తెలియని భయం నుంచి ఇంటికి చేరుకున్నామని ఖమ్మం వైద్యవిద్యార్థిని తపస్వీ తెలిపారు. కుమార్తె ఇంటికి చేరడంతో తండ్రి డాక్టర్ బాబారావు సంతోషంలో మునిగిపోయారు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడకి చెందిన గురుచరణ్.. రుమేనియా మీదుగా స్వస్థలానికి చేరుకున్నాడు. గురుచరణ్ రాకతో.. తల్లిదండ్రులు, శ్రేయభిలాషులు ఆనందం వ్యక్తం చేశారు.