తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనున్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో రమణ సమావేశం అవుతారు. పార్టీ మారే విషయమై కార్యకర్తలు, అభిమానులతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత ఎల్.రమణ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
L Ramana: తెరాసలో చేరనున్న రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ - l ramana news
12:10 July 08
తెరాస గూటికి ఎల్. రమణ
గత కొన్ని నెలలుగా రమణ తెరాసలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు రమణ, ఇటు తెరాస స్పందించలేదు. తాజాగా ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో బీసీ నేతల సమీకరణపై తెరాస దృష్టి సారించింది. అందులో భాగంగానే రమణ పేరును పరిగణనలోనికి తీసుకుంది.
ఆవిర్భావం నుంచి తెదేపాలోనే
రమణ తెలుగుదేశం సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. 1994లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి, 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2009 శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెతెదేపా అధ్యక్షునిగా రమణ కొనసాగుతున్నారు.
- ఇదీ చదవండి :పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ
నేడు చేరిక!
ఇటీవల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. 2018లోనే ఆయన తెరాసలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా... పరిస్థితులు అనుకూలించలేదు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాస సీనియర్ బీసీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రమణతో చర్చలు జరిగాయి. రమణకు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సీనియర్, చేనేత వర్గానికి చెందిన ఆయనకు తెరాస సముచిత స్థానం కల్పిస్తుందని మంత్రి ఎర్రబెల్లి ఇతర నేతలు వెల్లడించినట్లు తెలిసింది. రమణ సానుకూలంగా ఉన్నందున నేడు తెరాసలో చేరనున్నట్లు సమాచారం.
స్తబ్ధుగా తెతెదేపా..
పార్టీ అధ్యక్షుడు రమణ తెరాసలో చేరతారనే ప్రచారంపై తెదేపా శ్రేణులు స్తబ్ధుగా ఉన్నాయి. పార్టీకి ఇది మరింత దెబ్బ అని, పార్టీ పటిష్ఠానికి కృషి చేయాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు రమణ వెళ్లిపోతే శ్రేణుల్లో స్థైర్యం దెబ్బ తింటుందని కొందరు భావిస్తున్నారు. ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్నందున ఇప్పుడేమీ నష్టం లేదని మరికొందరు అంటున్నారు.