TS Seeds: రెండు నెలల్లో వానాకాలం పంటల సాగు ప్రారంభం కానున్న తరుణంలో విత్తనాల ధరలు ఆకాశనంటుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు వాటిని భారీగా పెంచేశాయి. సాధారణ పంటల విత్తనాలకు రాయితీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో ప్రైవేటువి కొనే రైతులపై ఆర్థికభారం భారీగా పెరగనుంది. విత్తనాలను కొనేందుకు ‘తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ’(టీఎస్ సీడ్స్) ఇటీవల టెండర్లు పిలవగా ప్రైవేటు కంపెనీలు భారీ ధరలు కోట్ చేశాయి. సోయా విత్తనాలకు క్వింటాకు రూ.14 వేలు, జీలుగకు రూ.5700, జనుముకు రూ.6వేల చొప్పున చెల్లించాలని టెండర్లలో కోరాయి. గతేడాది సోయా విత్తనాల ధర రూ.9,900 పేర్కొనగా చివరికి రూ.12వేల వరకూ విక్రయించాయి. ఇప్పుడు మరో రూ.2వేలు పెంచేశాయి. జీలుగ, జనుము విత్తనాల ధరలనూ రూ.1,000 నుంచి 2వేల దాకా పెంచాయి. రైతులు అధికంగా సాగుచేసే పత్తి, వరి విత్తనాల కొనుగోలుకు టీఎస్ సీడ్స్ టెండర్లు పిలవలేదు. పత్తి విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్ ధర గతేడాది(2021) వానాకాలంలో రూ.767 ఉండగా.. దాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.810కి పెంచింది. ఎకరానికి రెండు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం.. కొందరు రైతులు మొక్కలు సరిగా రావని ఎకరానికి నాలుగైదు ప్యాకెట్లు వాడటం ఆనవాయితీగా మారింది. వచ్చే జూన్ నుంచి వానాకాలంలో అరకోటి ఎకరాలకు పైగా పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. పత్తి విత్తన ప్యాకెట్లు కోటికి పైగా గ్రామాలకు పంపాలని విత్తన కంపెనీలకు వ్యవసాయశాఖ సూచించింది. ఒక్కో ప్యాకెట్ ధరను అదనంగా రూ.43 పెంచడం వల్ల కోటి ప్యాకెట్లపై రూ.43 కోట్ల ఆర్థికభారం రైతులపై పడనుంది.
వరిపై... కంపెనీల ఇష్టం:వరి విత్తనాలను ప్రైవేటు కంపెనీలు వివిధ బ్రాండ్ల పేర్లతో ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నాయి. విత్తన ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేనందున ఒక్కో కంపెనీ ఒక్కో బ్రాండు విత్తనాన్ని ఒక్కో ధరకు విక్రయిస్తోంది. ఉదాహరణకు సాంబ మసూరి(బీపీటీ 5204) పేరుగల సన్నరకం వరి విత్తనాలకే ఒక్కో కంపెనీ ఒక్కో పేరు పెట్టి రూ.3 వేల నుంచి రూ.4500 దాకా విక్రయిస్తోంది. కానీ దాని మూల విత్తనం ఒక్కటేనని, బ్రాండును బట్టి అధిక ధరకు కొనాల్సిన అవసరం లేదని జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. టీఎస్ సీడ్స్ సొంతంగా రైతులతో 2లక్షల క్వింటాళ్లకు వరి విత్తనాలను పండించి అమ్మకాలకు సిద్ధం చేసింది. వీటి ధర కూడా రూ.3వేల వరకూ ఉంటుందని సమాచారం. వరి పంట గత వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. వచ్చే వానాకాలంలోనూ అరకోటి ఎకరాల్లో వేయవచ్చని అంచనా.