అదనపు ఆదాయం కోసం ఆర్టీసీ మొదలుపెట్టిన కార్గో, పార్సిల్ సేవల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంబంధికులు గోదాంలోకి వెళ్లి పార్సిళ్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీఎస్‌ఆర్టీసీ నిర్లక్ష్యం.. వినియోగదారుల పాలిట శాపం
టికెటేతర ఆదాయ వనరుగా మారిన కార్గో, పార్సిల్ సేవల నిర్వహణలో టీఎస్‌ఆర్టీసీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఎండకు ఎండి, వానకు తడిచేట్టు ప్రయాణికులను వదిలేసిన అధికారులు.. పార్సిళ్లకూ అదే గతి పట్టిస్తున్నారు. సంబంధికులే గోదాంలోకి వెళ్లి పార్సిళ్లు తీసుకోవాల్సి వస్తోంది. హమాలీలు తీసుకువచ్చేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఎంజీబీఎస్‌లో దాదాపు సగానికిపైగా మడిగలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో పార్సిల్ బుకింగ్, డెలివరీ సేవలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇదే ప్రాంగణంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పార్సిల్ బుకింగ్, డెలివరీ కేంద్రం ఒకటి ఉంటుంది. అక్కడే రంగారెడ్డి రీజియన్‌ది మరొకటి ఉంది. పార్సిల్ బుకింగ్, డెలివరీ పక్కపక్కనే నిర్వహిస్తే గందరగోళం కొంతవరకు తగ్గుతుందని వారు చెబుతున్నారు. కానీ.. పార్సిల్ బుకింగ్ కేంద్రాన్ని ఆరుబయట నిర్వహిస్తున్నారు.
అంతా గందరగోళం..
ఎంజీబీఎస్‌లో రోజుకు 16 వేలకు పైగా పార్సిళ్లు బుక్ అవుతున్నాయి. ఇతర ప్రాంతాల అదేస్థాయిలో వస్తున్నాయి. రోజుకు కనీసం రూ.2.50 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఎంజీబీఎస్ ప్రాంగణంలోనే ఒకటి రెండు మడిగలను తీసుకుని, పార్సిళ్లను, సరకులను భద్రపరచాల్సి ఉంటుంది. పార్సిళ్లను క్రమపద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ.. మీ పార్సిల్‌ను మీరే గుర్తు పట్టండి అనేట్టు తయారయ్యింది. జేబీఎస్‌లోనూ ఇదే దుస్థితి. పార్సిల్ వచ్చిందో లేదో కూడా తెలియదు. నాణ్యమైన పార్సిల్ సేవలను అందజేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా