కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవ సమాచారం చేరవేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించింది. సామాజిక మాధ్యమాల్లో కరోనా గురించి ఇష్టారీతిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్న తరుణంలో.. ఏదీ నిజమో నమ్మలేని పరిస్థితి నెలకొంది. వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు ‘తెలంగాణ స్టేట్ పోలీస్’ పేరుతో టెలిగ్రామ్ ఛానెల్‌ను ప్రారంభించింది. రెండు రోజుల్లోనే ఇందులో 2,400 మంది వినియోగదారులు చేరారు. సుమారు 2 లక్షలమంది వరకు చేరే అవకాశముంది.
పక్కా సమాచారం చేరేలా..
దీనిద్వారా ఎక్కువమందికి అధికారిక సమాచారం చేరవేసే వీలు కలుగతుంది. జంటనగరాల్లోనే ఉండిపోయిన పౌరుల్లో చాలామంది స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ రవాణా అనుమతుల లేఖల కోసం పోలీస్ ఠాణాల చుట్టూ తిరగడం కలకలం రేకెత్తించింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ పౌరులకు పక్కా సమాచారం చేరేలా ఈ కొత్త ఛానెల్‌ను ప్రారంభించింది.