Telangana government revenue sources: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగభాగం ముగిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,56,958 కోట్ల వ్యయంతో భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. 2,52,661 కోట్లుగా ఆదాయం అంచనావేసింది. పన్ను ఆదాయాన్ని లక్షా 26,606 కోట్లుగా మొత్తం రెవెన్యూ ఆదాయాన్ని 1,93,029 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 55వేల కోట్లను అప్పుల ద్వారా సమీకరించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఐతే రుణాల విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, ఆంక్షలు సర్కార్‌కి ఇబ్బందికరంగా మారాయి.
రుణ పరిమితిలో కేంద్రం కోత:వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల చెల్లింపులను బడ్జెట్ నుంచే చేస్తుండడంతో వాటిని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకే పరిగణిస్తామన్న కేంద్రం ఆ మేరకు మొదట రుణాలకు అనుమతివ్వ లేదు. ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపాక రెండు నెలల తర్వాత జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీతో అప్పులు తీసుకునేందుకు అనుమతి లభించింది. రుణ పరిమితిలో కేంద్రం కోత విధించడంతో పాటు కార్పోరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురైంది. తద్వారా ఉద్యోగుల వేతనాలు, ఇతర చెల్లింపులు ఆలస్యమవుతూ వచ్చాయి. వచ్చిన పన్ను ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగ్ లెక్కలు: కేంద్రం నిబంధనలు, ఆంక్షలతో నిధులను సమకూర్చుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడింది. పన్నుల వసూలు వ్యవస్థను పటిష్టపరచడం ఓడీఎస్ అమలు, నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, రాజీవ్‌స్వగృహ ఫ్లాట్ల విక్రయం వివిధ రుసుముల పెంపు తదితరాల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను కొనసాగిస్తోంది. అందుకు అనుగుణంగా సర్కార్‌కి కొంతమేర ఆదాయం సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్‌కు ఇచ్చిన వివరాల ప్రకారం ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి 61వేల కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది.