Telangana income and expenditure: అక్టోబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఆదాయం అంచనాలను సగానికి పైగా చేరుకొంది. ఈ ఏడాది పన్నుల ద్వారా లక్షా 69 వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేయగా... అక్టోబర్ వరకు 50.70 శాతం 54 వేల 198 కోట్ల రూపాయలు వచ్చాయి. జీఎస్టీ ద్వారా 17 వేల 799 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా 5 వేల 880 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 15 వేల 20 కోట్లు, ఎక్సైజ్ పన్ను ద్వారా 8 వేల 611 కోట్లు వచ్చాయి. కేంద్ర పన్నుల రాష్ట్ర వాటాగా 4207 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 2678 కోట్లు సమకూరాయి. అమ్మకం పన్నులో 56 శాతం, జీఎస్టీ, ఎక్సైజ్ పన్నులో 50 శాతం అంచనాలను చేరుకుంది. అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల పన్నుల ద్వారా 8338 కోట్ల రూపాయలు సమకూరాయి. 417 కోట్ల పన్నేతర ఆదాయం వచ్చింది. 342 కోట్ల రూపాయులు గ్రాంట్ల రూపంలో వచ్చాయి.
చివరికి రుణాలే దిక్కయ్యాయి..
telangana state debt in 2021: పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు మాత్రం అంచనాలకు చాలా దూరంగా ఉన్నాయి. పన్నేతర ఆదాయం కేవలం 9.34 శాతం 2854 కోట్ల రూపాయలు వచ్చాయి. గ్రాంట్ల అంచనాలో కేవలం 13 శాతం 5155 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అక్టోబర్ నెలాఖరు వరకు 62 వేల 208 కోట్ల రూపాయలు సమకూరాయి. బడ్జెట్ అంచనా అయిన లక్షా 76 వేల 126 కోట్లలో ఇది కేవలం 35.32 శాతం మాత్రమే. ఆదాయంతో పాటు కేంద్ర గ్రాంట్లు ఆశించిన మేర లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సి వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 45 వేల 509 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవాలని ప్రతిపాదించింది. అందులో అక్టోబర్ నెలాఖరు వరకు 28 వేల 349 కోట్లు రుణంగా తీసుకున్నారు. అంచనాల్లో ఇది 62.29 శాతంగా ఉంది.