వైరల్: హోంమంత్రి మనవడి టిక్‌టాక్ వీడియో - రాష్ట్ర హోంమంత్రి
టిక్‌టాక్ వీడియోల పట్ల యువత మోజు రోజురోజుకు పెరిగిపోతోంది. వేలం వెర్రిగా మారి ఎక్కడ పడితే అక్కడ టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరిస్తున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర హోంమంత్రి మనవడు ఫుర్కాన్ అహ్మద్ టిక్‌టాక్ వీడియో వివాదాస్పదంగా మారింది.
రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఫుర్కాన్ అహ్మద్ టిక్‌టాక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫుర్కాన్ తన స్నేహితుడితో కలిసి కింగ్ నాగార్జున నటించిన డాన్ సినిమా హిందీ డబ్బింగ్ డాన్ నం.1 డైలాగ్‌ను చిత్రీకరించారు. హోంమంత్రి వినియోగించే ప్రభుత్వ అధికారిక వాహనంపై కూర్చొని వీడియో చిత్రీకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీడియో తీస్తున్న సమయంలో అధికారిక వాహన డ్రైవర్ అక్కడే అటువైపు తిరిగి ఉన్నారు. హోంమంత్రి అధికారిక వాహనాన్ని ఇలా టిక్‌టాక్ వీడియో తీయడానికి వినియోగించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలి ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో పొరుగుసేవల సిబ్బంది టిక్‌టాక్ వీడియో చేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో హోంమంత్రి మనవడి వీడియో చర్చనీయాంశంగా మారింది.
- ఇదీ చూడండి : కర్ణాటకీయం: ప్రారంభమైన చర్చ... కాసేపట్లో ఓటింగ్
TAGGED:
మహమూద్ అలీ