తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 5:44 AM IST

Updated : Oct 30, 2019, 7:16 AM IST

ETV Bharat / city

మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

రాష్ట్రంలో పసుపు అభివృద్ధి మండలి ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది. పసుపు పంట సాగుకు సంబంధించి క్వింటాల్ ఉత్పత్తి చేయడానికి.. 6 వేల రూపాయల వరకు వ్యయం అవుతుండటం వల్ల.. ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున రైతులు నష్టపోతున్నారు. ఏటా కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధర జాబితాలో పసుపు పంట కూడా చేర్చి.. క్వింటాల్‌కు 9 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అలాగే నిజామాబాద్‌లో పసుపు అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలంటూ.. తాజాగా కేంద్రానికి సిఫారసు చేసింది.

telangana state government turmeric board proposal to central government

మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

ఏ శుభకార్యమైనా పసుపు ఉండాల్సిందే. కానీ, పసుపు పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాలతో అశుభమే మిగులుతోంది. రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర ఉద్యాన శాఖ, శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా ఏటా కేంద్రం... కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్న 24 పంటల జాబితాలో పసుపు పంట లేదు. ఈ పంట పండించిన రైతులకు ఎంత ధర ఇవ్వాలనేది వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది.

పసుపు బోర్టు ఏర్పాటు చేయాలి

పసుపును కూడా మద్దతు ధరల జాబితాలో చేర్చి క్వింటాల్‌కు 9 వేల రూపాయల చొప్పున ధర ఇవ్వడంతోపాటు నిజామాబాద్‌లో పసుపు అభివృద్ధి మండలి - పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రానికి విన్నవించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర ఉద్యాన శాఖ అధికారులు, జాతీయ సుగంధ ద్రవ్యాల మండలి శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించి స్వయంగా రైతులతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు, సాగు ఖర్చులు, మద్దతు ధర ఇవ్వాల్సిన ఆవశ్యకత వివరిస్తూ కేంద్రానికి ఉద్యాన శాఖ తాజాగా నివేదిక పంపించింది.

9వేలు మద్దతు ధర ఇవ్వాలి

రాష్ట్రంలో పసుపు పంట అత్యధికంగా 1.34 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఎకరానికి సగటున 20 క్వింటాళ్ల చొప్పన దిగుబడి వస్తోంది. క్వింటాకు 6 వేల రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు, కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకారం పెట్టుబడి ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి క్వింటాల్‌కు 9 వేల రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించాలని సర్కారు తన సిఫారసుల్లో స్పష్టం చేసింది. కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని జాతీయ సుగంధ ద్రవ్యాల మండలిలో పసుపు పంట ఒక భాగంగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సహా... అదే జిల్లాలో కొనసాగుతున్న పసుపు పరిశోధన కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

ప్రజల వినియోగం 20 వేల క్వింటాళ్లే...

గత ఏడాది 26.70 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి రాగా రాష్ట్ర ప్రజల వినియోగం కేవలం 20 వేల క్వింటాళ్లే ఉంది. గత ఏడాది 1,607.29 కోట్ల రూపాయల పంటను రైతులు పండించారు. రాష్ట్రంలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా అన్నదాతలను వేధిస్తోంది. ఈ తరుణంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పసుపు పంటను కూడా చేర్చి ప్రతి రైతుకు చెందిన క్షేత్రంలో 100 పని దినాలు కూలీలు పనిచేసేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది.

ఇవీ చూడండి:నేడే సకల జనుల సమరభేరి

Last Updated : Oct 30, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details