రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి ఘనంగా జరిగింది. తెల్లవారుజామునుంచే... యువతులు ఉత్సాహంగా ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ స్నేహపూర్వక సంబంధాలకు నిలయమని పేర్కొన్నారు.
హైదరాబాద్ నారాయణగూడలో భాజపా నాయకులు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా గంగిరెద్దులతో నృత్యం చేశారు. భాజపా నేత శ్రీధర్ ఇంటింటికీ తిరుగుతూ... ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కైలాసగిరి వ్రతం నిర్వహించారు. వ్రతంలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించి భోగిపళ్లు వేశారు. కరీంనగర్‌లో యువతులు రంగురంగుల రంగవల్లికలు వేసి... నవధాన్యాలు, పూలతో అలంకరించారు.