Telangana Cabinet Meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. పారా బాయిల్డ్ బియ్యం కొనబోమని కేంద్రం మరోమారు స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో సాగు చేయాల్సిన పంటలపై సమావేశంలో చర్చిస్తారు. యాసంగి పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
కొవిడ్ పరిస్థితులపైనా కేబినెట్లో చర్చించనున్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన తరుణంలో దాని ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత.. వంటి అంశాలను మంత్రివర్గంలో చర్చించనున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం, ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేలా సాయం కోరుతున్న ఎల్ అండ్ టీ మెట్రో తదితర అంశాలపైనా చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు, జోనల్ విధానం ప్రకారం వర్గీకరణ, ఉద్యోగ నియమాకాల అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా వరి సాగు, వడ్లు కొనుగోళ్లపై రాష్ట్రంలో భాజపా, తెరాస మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతోంది. రాష్ట్రంలో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయాలను చూపాలని కేంద్రం చెప్పిందని, యాసంగి వడ్లు కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తోందని.. తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కొనుగోళ్ల కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతున్నారని.. భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు.
Paddy Procurement in Telangana: దీనిపై సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రం ప్రభుత్వం, భాజపా నేతలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లు కొనుగోళ్లపై కేంద్రాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా.. వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఈనెల 18 మహాధర్నాకు పిలుపునిచ్చి.. స్వయంగా కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర కేబినెట్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరై. కేంద్రంపై విమర్శలు చేశారు. అయితే కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. అనంతరం కొంతమంది మంత్రులను వెంటబెట్టుకొని నాలుగురోజుల క్రితమే వెళ్లి వచ్చారు. మంత్రులు సైతం ఈనెల 26న కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయినా స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.