Gram Panchayats Online Audit: రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. తాజాగా గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. అంతకుముందు కూడా మొదటి స్థానంలో నిలవడం విశేషం. అదే ఒరవడిని కొనసాగిస్తూ వరుసగా రెండో సారి నంబర్ వన్ స్థానంలో నిలిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రశంసించింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్ సేథీ రాష్ట్రానికి లేఖ రాశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు పొందాలంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25 శాతం ఆడిట్ విధిగా పూర్తి చేసి ఉండాలని గుర్తు చేశారు.
తెలంగాణ నంబర్ వన్..
Online Audit of Panchayats Telangana : కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తోంది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం విషయమై ఆన్‌లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్లైన్లోనే అందిస్తున్నాయి. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్‌లైన్ ఆడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో 72 శాతంతో తమిళనాడు, 60 శాతంతో ఆంధ్రప్రదేశ్, 59 శాతంతో కర్ణాటక రాష్ట్రాలున్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతంలోపే ఆన్‌లైన్ ఆడిటింగ్ పూర్తి చేసి వెనుకబడ్డాయి. 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై నిర్వహించిన ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలవడం విశేషం.