దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్ పెర్ఫార్మర్స్ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం స్టార్టప్ స్టేట్ ర్యాంకులు విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా వాటిని స్టార్టప్ మెగాస్టార్స్ (బెస్ట్ పెర్ఫార్మర్స్), సూపర్‌స్టార్స్ (టాప్ పెర్ఫార్మర్స్), స్టార్స్ (ది లీడర్స్), రైజింగ్ స్టార్స్ (యాస్పైరింగ్ లీడర్స్), సన్‌రైజర్స్ (ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్) పేరుతో అయిదు విభాగాలుగా విభజించారు. ‘‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్ రాష్ట్రంలోని స్టార్టప్స్ ఏర్పాటుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తోంది. స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తూ మార్గనిర్దేశం చేస్తోంది. తెలంగాణ ఓపెన్ డేటా పాలసీ 2016 ద్వారా విభిన్న డిపార్ట్‌మెంట్లకు చెందిన డేటాను బహిర్గతం చేస్తూ పరిపాలనలో పారదర్శకతకు పీట వేసింది. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి వి-హబ్ పేరుతో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేసి వారికి నిధులు, మార్గదర్శనం, ప్రణాళిక, వృద్ధి విషయంలో చేయూతనందిస్తోంది. స్టార్టప్స్‌కు నిధులు సమకూర్చడానికి టి-ఫండ్ పేరుతో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయడం, స్టార్టప్స్‌తో పెట్టుబడిదారులను అనుసంధానం చేయడానికి 15కిపైగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టి-ఫండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకుపైగా కేటాయించింది. ఇప్పటి వరకు 50కి పైగా స్టార్టప్‌లు రూ.కోటి నిధులను దీని ద్వారా అందుకున్నాయి. టి-ఫండ్‌కు అదనంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్‌జీఎస్‌టీ వాపసు చేస్తోంది. పనితీరు ఆధారంగా గ్రాంట్ మంజూరు చేస్తోంది. పేటెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంటర్నేషనల్ మార్కెట్ ఛార్జీలు, ఉద్యోగనియామకాల కోసం చేసే ఖర్చులను తిరిగి చెల్లించడం ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమంలో 800 స్టార్టప్స్, 150 మందికిపైగా భాగస్వాములయ్యారు. స్టార్టప్స్‌కు అవసరమైన మద్దతు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం 250మందికిపైగా అధికారులకు అవగాహన కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఏర్పడిన ఇంక్యుబేటర్లకు 100% శిక్షణ ఇస్తోంది. 350మందికిపైగా ప్రైవేటు పెట్టుబడిదారులను స్టార్టప్‌లకు మద్దతిచ్చేలా ప్రోత్సహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పదికిపైగా డిపార్ట్‌మెంట్లు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి’’ అని కేంద్రం తాజా నివేదికలో వివరించింది. రాష్ట్రాల పనితీరును లెక్కించడానికి కేంద్రం పరిగణనలోకి తీసుకున్న ఏడు అంశాల్లో నాలుగింట తెలంగాణ లీడర్ జాబితాలో చోటు సంపాదించుకొంది.
వెతికినా కనిపించని ఆంధ్రప్రదేశ్
స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఉత్తమ పద్ధతులు అనుసరిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పదం వెతికినా కనిపించలేదు. కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో చివరి విభాగంలో నిలిచిన బిహార్ పలు ఉత్తమ పద్ధతులను అమలు చేస్తున్నట్లు స్టార్టప్ నివేదిక పేర్కొంది. కానీ ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులేమీ ఇందులో కనిపించలేదు. బిహార్ 2017 స్టార్టప్ పాలసీ విడుదల చేసి రాష్ట్రంలో ఏర్పాటయ్యే స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 10 స్టేట్ సపోర్టెడ్ మెంటార్స్‌తో 250కిపైగా సంస్థలు అనుసంధానమైనట్లు తెలిపింది. దేశంలో వెనుకబడిన బిహార్‌లో కనిపించిన పద్ధతులు కూడా ఏపీలో కనిపించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రెండురోజుల క్రితం కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన సులభతర వాణిజ్యంలో తొలిగ్రూప్‌లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్స్ ప్రోత్సాహంలో మాత్రం వెనకబడిపోయినట్లు ఈ నివేదిక ద్వారా వెల్లడైంది.
సామర్థ్యం పెంపు, మార్గనిర్దేశం, నిధులు, ఇంక్యుబేషన్, సంస్థాగత విషయాల్లో మద్దతు, మార్కెట్ అందుబాటు, నవకల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహం ఆధారంగా రాష్ట్రాల స్థాయిని లెక్కించారు. 26 కార్యాచరణ సూత్రాల కొలమానంగా 100 మార్కులకు ఈ ర్యాంకులు ప్రకటించారు.
స్టార్టప్‌ల సాధికారతకు తెలంగాణ కృషి
తెలంగాణలో బలమైన స్టార్టప్ వాతావరణం ఉన్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇక్కడ ఏర్పాటైన స్టార్టప్‌లకు మారదర్శకత్వం, ఇంక్యుబేషన్, నిధుల మద్దతు ద్వారా సాధికారత కల్పిస్తున్నట్లు ప్రశంసించింది. 2016-21 తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ నవకల్పన, ప్రయోగాలు, రిస్క్ తీసుకొనే ధైర్యాన్ని నూరిపోసి రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు తెలిపింది.
1. మెగాస్టార్స్ గుజరాత్, కర్ణాటక
2. సూపర్‌స్టార్స్ తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా. కేంద్రపాలిత ప్రాంతం నుంచి జమ్మూకశ్మీర్