Singareni 133rd Formation Day : సింగరేణి కాలరీస్ కంపెనీకి 13 దశాబ్దాల మహోన్నత చరిత్ర ఉంది. భద్రాద్రి రామున్ని సందర్శించడానికి వెళ్తున్న భక్తులు వంట కోసం పొయ్యి రాళ్లను ఏర్పాటు చేసుకోగా.. అవి మండటంతో తొలిసారిగా బొగ్గు ఖనిజం వెలుగులోకి వచ్చింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం.. ఇల్లెందు ప్రాంతంలో పరిశోధనలు జరిపి 1871లో బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొంది. బ్రిటిష్ పాలకుల ఆధ్వర్యంలో 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ బొగ్గు తవ్వకాలకు లండన్‌లో హక్కులు పొందింది. 1889లో ఇల్లెందుకు సమీపంలోని సింగరేణి వద్ద తొలి బొగ్గు గనిని తవ్వి ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి 1920 వరకు హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరుతోనే బొగ్గు తవ్వకాలు జరిగాయి. 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరును ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా మార్చారు. ఈ నామకరణం చేసుకున్న రోజునే ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు.
తొలి ప్రభుత్వ రంగ సంస్థ..
Singareni Formation Day 2021 : 1945లో నిజాం సింగరేణి షేర్లను కొనుగోలు చేసి సంస్థ యాజమాన్యాన్ని స్వీకరించారు. ఈ విధంగా దేశంలో తొలి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. స్వాతంత్య్రానంతరం 1950లో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యానికి వచ్చింది. 1960లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా మారింది. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా 49:51 షేర్ల భాగస్వామ్యంతో కొనసాగుతోంది. గోదావరీ, ప్రాణహిత లోయలో బొగ్గు నిల్వలను సింగరేణి తవ్వకాలు చేపట్టింది. తొలుత 1889లో ఇల్లెందు ఏరియాలో.. 39 సంవత్సరాల తర్వాత 1928లో బెల్లంపల్లిలో బొగ్గును వెలికి తీయడం ప్రారంభించింది. మరో 9 సంవత్సరాల తర్వాత కొత్తగూడెంలో బొగ్గు గనులను తెరిచింది. స్వాతంత్య్రం తర్వాత 1961లో మందమర్రి, రామగుండంలో.. 1975లో శ్రీరాంపూర్, మణుగూరు ఏరియాలో బొగ్గు గనులకు శ్రీకారం చుట్టింది. 1991లో భూపాలపల్లి ఏరియాలో బొగ్గు గనులను ప్రారంభించుకొంది. ప్రస్తుతం 11 ఏరియాల్లో ఆధునిక సాంకేతికతతో బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. సింగరేణిలో 2020 నాటికి మొత్తం 48 గనులున్నాయి. వాటిలో 30 భూగర్భ గనులు, 18 ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.