తెలంగాణ

telangana

ETV Bharat / city

TSRTC Income in August తెలంగాణ ఆర్టీసీకి కాసులపంట - తెలంగాణ ఆర్టీసీ ఆదాయం

TSRTC Income in August సంస్థను నష్టాల్లోంచి గట్టించేందుకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఆగస్టు ఛాలెంజ్‌ పేరుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తోంది. ఈనెలలో రోజువారీ ఆదాయం 20 కోట్ల రూపాయలకు చేరాలని పెట్టుకున్న లక్ష్యాన్ని ఆర్టీసీ చేరుకుంది. రాఖీ పండుగ, తగ్గించిన టీ24 టికెట్లతో ఆర్టీసీకి భారీ ఆదాయం చేకూరింది.

TSRTC Income in August
TSRTC Income in August

By

Published : Aug 17, 2022, 9:55 AM IST

TSRTC Income in August : డీజిల్‌ సెస్ విధించిన తర్వాత... ఆర్టీసీ రోజువారీ టికెట్ ఆదాయం 12 కోట్ల రూపాయల నుంచి 14.50 కోట్లకు పెరిగింది. సోమవారాల్లో 18 కోట్లకుపైగా వస్తోందని యాజమాన్యం చెబుతోంది. విభిన్న ఆలోచనలు, ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ.. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఛాలెంజ్‌ను చేరుకునేందుకు ప్రయాణికులకు బంపరాఫర్‌ ప్రకటించింది. అవే ఆర్టీసీకీ లాభాల్ని తీసుకొచ్చాయి.

TSRTC Income increased in August : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పంద్రాగస్టు రోజున రాయితీ కల్పించిన టీ24 టిక్కెట్టును.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రయాణీకులు భారీగా వినియోగించుకున్నారు. 120 రూపాయలు ఉన్న టీ24 టిక్కెట్టు ధరను ఆగస్టు 15న 75 రూపాయలకు తగ్గించడంతో గ్రేటర్‌లో అత్యధికంగా వినియోగించుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. మామూలు రోజుల్లో 11 వేలకు మించని టీ24 టిక్కెట్ల అమ్మకాలు 15వ తేదీన మూడు రెట్లకు పెరిగాయి. అంటే.. ఒక్కరోజే ఆర్టీసీకి టీ24 టికెట్ల అమ్మకం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్ రీజియన్‌లో... కాసుల పంట పండింది.

రాఖీ పండుగ రోజున చాలా మంది ప్రయాణం చేస్తారని భావించిన ఆర్టీసీ... అందుకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేసింది. ప్రయాణికులకు ఆరోజు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని...సిబ్బందికి ముందే తెలియజేసింది. ఈ నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చింది. రాఖీ పండుగ ఒక్కరోజే...20 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రాఖీ పండగ రోజున రికార్డుస్థాయిలో 45 ల‌క్షల మంది ప్రయాణీకులను... ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరవేసింది.

హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి ప్రధాన బ‌స్ స్టేష‌న్లయిన... ఎం.జి.బి.ఎస్‌, జె.బి.ఎస్ ల నుంచే కాకుండా... ఎల్‌.బి.న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్‌, సంతోష్‌న‌గ‌ర్‌, ఉప్పల్ క్రాస్ రోడ్డుల నుంచి అద‌నంగా... 1,230 స‌ర్వీసుల‌ను ప్రయాణీకుల‌కు అందుబాటులో ఉంచి.. సేవ‌లు అందించింది. వివిధ కారణాల చేత సోద‌రుల ద‌గ్గర‌కు వెళ్లలేని అక్కా, చెల్లెళ్లు.. దాదాపు 7వేలకు పైగా రాఖీలను పంపించేందుకు కార్గో, పార్శిల్ సేవలను వినియోగించుకున్నట్లు ఆర్టీసీ తెలియజేసింది. ఆర్టీసీని ఇదేవిధంగా ఆదరించాలని.. సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్‌ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు అవసరమైన మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details