TRS State Committee : తెరాస రాష్ట్ర కమిటీపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేపట్టారు. 40 మందితో కొత్త కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిసింది. 15 మంది వరకు ప్రధాన కార్యదర్శులు, 25 మందిని కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా నియమించనున్నారని సమాచారం. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలకూ ఉపయోగపడే వారిపై దృష్టి సారిస్తున్నారు. వారం, పదిరోజుల్లో పేర్లు ప్రకటించే వీలుంది.
TRS State Committee Members : తెరాస ప్రస్తుత రాష్ట్ర కమిటీ 67 మందితో ఉంది. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సంయుక్త కార్యదర్శులున్నారు. వచ్చే సంవత్సరం చివర్లో జరిగే శాసనసభ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనువుగా కొత్త కమిటీని ఆయన ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత కమిటీలో సగం మంది పనితీరుపై కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసంతృప్తితో ఉన్నారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణ మొదలుకొని.. ఇతరత్రా పార్టీ అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వర్తించడంలేదని వారు గుర్తించారు. కొందరు పదవిని అలంకార ప్రాయంగానూ, సొంత అవసరాలకు వాడుకున్నారని, వారివారి సామాజిక వర్గాలలోనూ పట్టు లేదని తేలింది. ఉప ఎన్నికలలో విధులను అప్పగించగా.. దానిని వదిలేసి, హైదరాబాద్‌లో తిష్ఠవేశారని తెలిసింది. కొంత మంది టీవీ చర్చలకే పరిమితం కాగా.. మరికొందరు తెలంగాణభవన్‌లో సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. కొందరికి నియమిత పదవులు ఇచ్చినా.. దానిని స్వప్రయోజనాలకే వాడుకున్నారని గమనించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా పలువురు సరిగా పనిచేయకపోవడంతో అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం కొందరిని నియమించగా.. వారు ప్రచారం మాని..హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీకి రావడం చూసి అందరూ విస్మయం చెందారు. కొందరి పనితీరు నచ్చక వారిని పార్టీ బాధ్యతల నుంచి తొలగించి, ఇతరులకు అధిష్ఠానం అప్పగించింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కమిటీలోని పలువురిని తొలగించి, కొత్త వారిని నియమించనున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు చోటు