తెలంగాణ

telangana

ETV Bharat / city

Rain News: జడిపించిన వాన.. ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం - వర్షాల వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను జడిపించాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు 370 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 200 కేంద్రాల్లో ఓ మోస్తరుగా వానలు పడ్డాయి. సోమవారం పగటిపూట కూడా పలు జిల్లాల్లో భారీ వానలు కురిశాయి.

జడిపించిన వాన
జడిపించిన వాన

By

Published : Jul 12, 2022, 4:36 AM IST

వర్షాల ధాటికి జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలోనే గరిష్ఠంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 19 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మూడు రోజులుగా వర్షాల సరళిని గమనిస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిశాయి. గోదావరి పరీవాహకంలోని ఈ జిల్లాల్లో కొన్ని మండలాల్లో ముసురు జల్లులు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌ నగరంతో పాటు జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనూ పగలు జోరువాన కురిసింది. వాణిజ్య సముదాయాలు ఖాళీగా కనిపించాయి. మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నెమ్మదించాయి. భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాల మధ్య ప్రధాన రహదారుల్లో చాలాచోట్ల వంకలు పొంగడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఇల్లెందు, పినపాక, ములుగు నియోజకవర్గాల్లో చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో గోదావరి పోటెత్తడంతో చాలా గ్రామాల లోలెవల్‌ చప్టాలపై వరద నిలిచిపోయింది. వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాల్లో ఈ పరిస్థితి కనిపించింది. కిన్నెరసాని, మున్నేరు, ముర్రేడు, మానేరు, నక్కవాగులు పొంగుతూనే ఉన్నాయి.

జలకళ.. గండ్లు, బుంగలు: ఈ ఏడాది జులై రెండోవారంలోనే చెరువులకు జలకళ సంతరించుకుంది. మంచిర్యాల, ములుగు, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ నీటిపారుదల సర్కిళ్ల పరిధిలో అత్యధిక చెరువుల్లోకి నీళ్లు చేరాయి. రాష్ట్రంలో మొత్తం 43,870 తటాకాలు ఉండగా 8,107 మత్తడి దుంకుతున్నాయి. 15,821 చెరువుల్లో 50 శాతం మేర నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్‌, ములుగు సర్కిళ్ల పరిధిలో రెండుచోట్ల ప్రాజెక్టుల కాల్వలకు గండ్లు పడ్డాయి. 21 చెరువులకు గండ్లు, బుంగలు పడినట్లు నీటిపారుదల శాఖ తెలిపింది. చెరువుల పునరుద్ధరణ పథకం మిషన్‌ కాకతీయకు ముందుతో పోల్చితే అతి తక్కువ సంఖ్యలో చెరువులకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.

సాధారణాన్ని మించి వర్షపాతం: ఈ ఏడాది నీటి సంవత్సరం(జూన్‌ నుంచి) ప్రారంభం నుంచి ఈ నెల 11 వరకు జిల్లాల్లో సాధారణాన్ని మించి వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 200.8 మి.మీటర్లు కాగా 391.1 మి.మీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలో 162 శాతం అధికంగా వాన పడింది. ఈ జిల్లాలో సాధారణ వర్షపాతం 232 మి.మీటర్లు కాగా 607.4 మి.మీటర్లు నమోదు కావడం విశేషం. భూపాలపల్లి జిల్లాలో 160 శాతం, ములుగులో 147, మహబూబాబాద్‌లో 144, రాజన్న సిరిసిల్ల 131, కరీంనగర్‌ 129, జగిత్యాల, మేడ్చల్‌ జిల్లాల్లో 123, కుమురం భీంలో 107 శాతం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జోగులాంబలో 8, వికారాబాద్‌లో 32 శాతం వర్షం కురిసింది.

మూడు కుటుంబాలకు పరిహారం: భీమ్‌గల్‌ మండలం బడాభీమ్‌గల్‌ ఊర చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లిన బిత్‌వార్‌ గణేశ్‌(45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. నిజామాబాద్‌ గ్రామీణ మండలం లింగితండా శివారులోని నెమ్లికుంట అలుగు ఉద్ధృతిలో కొట్టుకుపోయిన మక్కల నడిపి సాయిలు, దారంగుల రెడ్డి మృతదేహాలను వెలికితీశారు. ఈ ముగ్గురి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా..: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు 11 చోట్ల కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయి. 5 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు, 8 చోట్ల పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 7,900 ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న పంటలు మునిగాయి. 40 ఇళ్లు పాక్షికంగా.. ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా..: భద్రాద్రి జిల్లాలో బూర్గంపాడు మండలం సారపాక-రెడ్డిపాలెం మధ్య రాకపోకలు ఆగిపోయాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం నుంచి ఏపీలోని కూనవరం వెళ్లే మార్గంలో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. చర్లలోని తాలిపేరు జలాశయం ఉప్పొంగి ప్రవహిస్తోంది. చర్ల మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన 5 గ్రామాలకు, అశ్వాపురం మండలంలో 11 పంచాయతీలకు సంబంధాలు తెగిపోయాయి. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి, గంగోలులో 70 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పర్ణశాల వరద గుప్పిట్లో చిక్కుకుంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా..: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌-పలిమెల మండలాలను కలిపే పెద్దంపేట వాగు వంతెన వద్ద రహదారి తెగిపోవడంతో పలిమెల మండలానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మోదేడు గ్రామం చుట్టూ వాగు నీరు చేరడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

  • కాటారం మండలం ఒడిపిలవంచలో మత్తడి గోడ తెగిపోవడంతో చెరువు నీరంతా పొలాలకు చేరింది. బొప్పారం, గోపాల్‌పూర్‌-గొల్లపల్లి మధ్యన రహదారులు తెగిపోవడంతో మర్రిపల్లి, ప్రతాపగిరి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
  • మహాముత్తారం మండలం కాటారం-మేడారం రహదారిలో కేశవాపూర్‌లో రహదారి తెగిపోయింది. యామన్‌పల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. యత్నారంలో పెద్దవాగు వరద చేరడంతో గ్రామస్థులు అడవుల్లోకి వెళ్లి గుడారాలు వేసుకున్నారు.
  • ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌ వాజేడు మండలం పూసూరు గోదావరి వంతెన మీదుగా అరకిలోమీటరు నడుచుకుంటూ వెళ్లి వరద ఉద్ధృతిని పరిశీలించారు. ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులను సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు.
  • వెంకటాపురం మండలంలోని బల్లకట్టు వాగు, కుక్కతోగు, జిన్నెలవాగుల కారణంగా భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. 9 పంచాయతీలో అత్యవసర రాకపోకలకు వీలుగా నాటు పడవలు ఏర్పాటు చేశారు.

మూడు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన:సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. హైదరాబాద్‌ నగరం మేఘావృతమవుతుందని, చెదురుమదురుగా వానలు పడతాయని పేర్కొంది. ఆదివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం సోమవారం ఒడిశా తీరంలోని వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం రాగల 48 గంటల్లో బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details