రైల్వేశాఖ ఆదాయం పెంచుకునేందుకు సరకురవాణాపై ప్రత్యేకదృష్టి సారించింది. 2024 నాటికి సరకురవాణాను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కార్పొరేట్ తరహా మార్కెటింగ్ వ్యూహాల్ని అనుసరించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్లలో కొద్దిరోజుల క్రితమే ఏర్పాటైన ఆరు వ్యాపార అభివృద్ధి యూనిట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలంటూ అన్ని జోన్ల జీఎంలకు రైల్వేబోర్డు శుక్రవారం లేఖ రాసింది.
ఆదాయం పెంచేందుకు.. పట్టాలెక్కనున్న సరకు - telangana railway to improve income
కరోనాతో ప్రస్తుతం అన్నిరంగాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. గాడిలో పడేందుకు ఎవరికి వారు నూతన మార్గాలకోసం అన్వేషిస్తున్నారు. తాజాగా రాష్ట్ర రైల్వే శాఖ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు సరకు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది.
రవాణాకు రాయితీలు
రైల్వేతో పోలిస్తే రోడ్డుమార్గంలోనే ఎక్కువగా సరుకులు రవాణా అవుతున్నాయి.వీటిని తమవైపు తిప్పుకోవాలన్నది రైల్వేశాఖ లక్ష్యం. దీనికోసం కొన్ని నిబంధనల సడలింపుతో పాటు, ఛార్జీల్లో కొంత రాయితీలిస్తోంది. సరకులు రవాణా చేసుకునే కంపెనీలు, సంస్థలకు ఈ విషయాల్ని వివరిస్తూ రైల్వేవైపు ఆకర్షించాలని రైల్వేబోర్డు జీఎంలకు స్పష్టం చేసింది.జోన్ల వారీగా సరకురవాణా వివరాల నమోదుకు జాతీయస్థాయిలో ఈ డ్యాష్‌బోర్డును ఏర్పాటుచేయనుంది.
ద.మ.రైల్వే 122 మిలియన్ టన్నులు
2018-19లో 110 మిలియన్ టన్నుల సరకురవాణా లక్ష్యం పెట్టుకోగా.. 122.51 మిలియన్ టన్నులను ద.మ రైల్వే రవాణా చేసింది. 2024లో 240 మిలియన్ టన్నుల సరకుల్ని రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018-19లో మొత్తం రూ.18,719.13 కోట్ల ఆదాయం వస్తే.. ఒక్క సరకురవాణా ద్వారానే 12,705.41 కోట్లు వచ్చింది.
- ఇదీ చదవండి:ఆషాఢం.. శూన్యమాసమే కాదు అమ్మవారి మాసం!