తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వేళ.. రోగుల ప్రాణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల కాసులాట - telangana private hospitals are looting people

రాష్ట్ర రాజధానిలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల ప్రత్యేక దోపిడి వల్ల వేలాది కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. తమ వారిని కరోనా వ్యాధి నుంచి రక్షించుకోవడానికి కొందరు ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లోనూ, వడ్డీ వ్యాపారుల దగ్గర కుదువపెడుతున్నారు.. మరికొందరు ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మేసి తమ వారి ప్రాణాల కోసం ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి రోగి చనిపోయిన తరువాత కూడా మొత్తం బిల్లు చెల్లిస్తేనేగానీ మృతదేహాన్ని ఇచ్చేది లేదంటూ కరాఖండిగా చెబుతున్నాయి ఆస్పత్రులు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా పరిశీలన చేసి నాలుగైదు ఆస్పత్రుల మీద మాత్రమే చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

private hospital, private hospital  loots people
ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల దందా, తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా

By

Published : May 21, 2021, 8:33 AM IST

Updated : May 21, 2021, 11:03 AM IST

ఐసీయూ అంటే.. వారికి పండగే! హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో చిన్నా పెద్దా ఆస్పత్రులు 4వేల వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు 3 వేల వరకు చిన్న, మధ్యస్థాయి ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండానే కరోనా వైద్యం మొదలుపెట్టాయి. నగరంలో ప్రస్తుతం ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పడకలు వెంటనే దొరకడం లేదు. గాంధీ, టిమ్స్‌ లాంటి ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు... నగరంలోని పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి. ఈ అవకాశాన్ని మధ్యస్థాయి ప్రైవేటు ఆసుపత్రులు యుక్తిగా ఉపయోగించుకుంటున్నాయి.

ఐసీయూలో వెంటిలేటర్‌ పడక కావాలంటే రోజుకు రూ.లక్ష వరకు అవుతుందని బేరం పెడుతున్నాయి. తమ వారు బతికితే చాలని కుటుంబసభ్యులు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. కొందరు డబ్బు సమకూర్చుకునే మార్గం లేక ఉన్న నగలు, ఆఖరికి పుస్తెలతాడును సైతం తాకట్టుపెడుతున్నారు. ఇంకొందరు పైసాపైసా కూడబెట్టి కొనుకున్న స్థలాన్ని తక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. ఇక కొన్ని ఆస్పత్రులు తమ పైశాచికాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆరోగ్యం విషమించిన రోగులను కొన్ని రోజులపాటు వెంటిలేటర్‌ మీదే ఉంచి రూ.15 లక్షలకు పైన బిల్లు వేసి.. ఆ తరువాతే వెంటిలేటర్‌ తీసి రోగి చనిపోయినట్లుగా బంధువులకు చెబుతున్నాయి. ఇటీవల నల్గొండ క్రాస్‌రోడ్డులో ఓ ఆస్పత్రి ఒక రోగికి రూ.23 లక్షల బిల్లు వేస్తే, కూకట్‌పల్లిలో మరో రోగికి రూ.18 లక్షల బిల్లు వేశారు.

ఎన్ని దారుణాలో..

ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.. కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. 14 రోజులకు రూ.15 లక్షల బిల్లు వేశారు. ఉన్న బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టుపెట్టి డబ్బు తెచ్చి మొదట రూ.10 లక్షలు చెల్లించారు. 14వ రోజున మొత్తం రూ.15 లక్షల బిల్లు అయింది. రోగి చనిపోయాడని మిగిలిన రూ.5 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదేం దారుణమంటూ కుటుంబీకులు కన్నీరు మున్నీరైనా కూడా ఆస్పత్రి వర్గాలు కరగలేదు.

రూ.8 లక్షల అప్పు చేసినా ఫలితం లేదు..

నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ మహిళ(62) ఈనెల 11న కరోనాతో చైతన్యపురిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరింది. ఒక్కరోజు వైద్యం అందించిన ఆసుపత్రి రూ.లక్షన్నర వసూలు చేసి వెంటిలేటర్‌ లేదని ఎల్‌బీనగర్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి సిఫారసు చేశారు. అక్కడ ఐదు రోజులకు రూ.6లక్షల 50వేలు బిల్లు వేశారు. బుధవారం పరిస్థితి చేయి దాటిందని గాంధీకి పంపించారు.

మరో రూ.10 లక్షలు కట్టాల్సిందే

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ కొవిడ్‌ రోగి మృతి చెందాడు. అప్పటికే రూ.12 లక్షలు చెల్లించగా.. మరో రూ.10 లక్షలు కట్టాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్‌ చేసింది. పోలీసుల రాకతో.. వెనక్కితగ్గింది. బాధితుల వివరాల ప్రకారం.. ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో ఏప్రిల్‌ 30న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమించి గురువారం మృతి చెందాడు. మరో రూ.పది లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు చెప్పగా.. వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి చనిపోయాడని, అప్పటికే దాదాపు రూ.12 లక్షలు చెల్లించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారికి ఫిర్యాదు చేస్తామనడంతో వెనక్కి తగ్గి.. మృతదేహాన్ని అప్పగించారు.

బిల్లు కట్టేందుకు బంగారం తాకట్టు

కొవిడ్‌ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే.. బిల్లుల కోసం అప్పులు చేయడమే కాకుండా బంగారు నగలు తాకట్టు పెట్టాల్సి వస్తోంది. హైదర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనా పాజిటివ్‌తో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి యాజమాన్యం రూ.20 లక్షల బిల్లు వేసింది. చికిత్స సమయంలోనే రూ.9లక్షలు చెల్లించారు. ఇంకా రూ.11 లక్షలు కడితేనే డిశ్చార్జీ చేస్తామని చెప్పడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. అవి సరిపోక బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి.. డబ్బు కట్టాల్సి వచ్చిందని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఒక్కొక్కటి రూ.40 వేలకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని వాపోయారు.

‘రూ.1.5లక్షలు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తాం’

ఘట్‌కేసర్‌కు చెందిన దావుద్‌(48)కు ఐదు రోజుల కిందట కరోనా సోకగా.. మేడిపల్లిలోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేరారు. నాలుగు రోజులకే రూ.3.50లక్షల బిల్లు ఆసుపత్రిలో చెల్లించారు. బుధవారం మధ్యాహ్నం కుటుంబీకులకు దావూద్‌ ఫోన్‌ చేసి తాను బాగానే ఉన్నానని..వచ్చి తీసుకెళ్లండన్నారు.సంతోషంతో వారు గురువారం వచ్చి తీసుకెళ్తామని నచ్చజెప్పారు. సాయంత్రం 6:30గంటల ప్రాంతంలో ఆసుపత్రి వర్గాలు దావూద్‌ మృతి చెందాడని సమాచారం ఇచ్చారు. మూడు గంటల ముందు మాట్లాడారని.. ఎలా చనిపోయారంటూ వారు ప్రశ్నించారు. మృతదేహాన్ని చూపించాలని వాగ్వాదానికి దిగారు. మిగతా రూ.1.50 లక్షలు చెల్లిస్తేనే అప్పగిస్తామని చెప్పడంతో కుటుంబీకులు విషయాన్ని ఓ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన యాజమాన్యంతో మాట్లాడి రూ.40 వేలు చెల్లించేలా ఒప్పించారు.

రూ.7లక్షల అప్పు మిగిలింది..!

కాప్రా ప్రాంతానికి చెందిన పాండు(38) పుట్టు దివ్యాంగుడు. గత నెల 13న అతనికి పాజిటివ్‌ అని తేలింది. తార్నాకలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. నాలుగు రోజుల తర్వాత అక్కడ ఆక్సిజన్‌ లేకపోవడంతో గాంధీలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నాలుగు రోజులకే రూ.7 లక్షలు వసూలు చేసిందా ప్రైవేట్‌ ఆసుపత్రి. అప్పు తెచ్చి కట్టినా ప్రాణం నిలవలేదు.

కూతురి నిశ్చితార్థం డబ్బులన్నీ పెట్టినా..

మల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన ఓ మహిళ(48)కు గతనెల 18న పాజిటివ్‌గా తేలింది. ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా.. మూడు రోజుల తర్వాత చనిపోయినట్లు తెలిపారు. రూ.5లక్షలు బిల్లు వేయడంతో చేతిలో డబ్బుల్లేక అప్పు తెచ్చి కట్టారు. అదే నెలలో కూతురి నిశ్చితార్థం కోసం జమ చేసిన సొమ్ము సైతం ఇందుకే ఖర్చయిపోయింది.

Last Updated : May 21, 2021, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details