తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి రాత్రి లైట్లు మాత్రమే ఆపాలి: సీఎండీ

అన్ని ఇళ్లలో ఒకేసారి విద్యుద్దీపాలు ఆపడం వల్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ జెన్‌కో,ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు. ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలు మాత్రమే తొమ్మిది నిమిషాలు ఆపాలని విద్యుత్తు శాఖాధికారులు ప్రకటించారు.

light for nation
light for nation

By

Published : Apr 5, 2020, 5:56 AM IST

ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలు మాత్రమే తొమ్మిది నిమిషాలు ఆపాలని విద్యుత్తు శాఖాధికారులు ప్రకటించారు. ‘ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌, కూలర్లు వంటి వాటిని ఆపకూడదు. అపార్టుమెంట్లు, కాలనీలకు కరెంటు సరఫరా అయ్యే ప్రధాన వ్యవస్థలైన ట్రాన్స్‌ఫార్మర్లు, మెయిన్‌ వద్ద సరఫరా కొనసాగించాలి. వీధి దీపాలు కూడా వెలగనివ్వాలి’ అని సూచించారు.

గ్రిడ్‌పై ప్రభావం..

దేశంలో ఒకేసారి దీపాలు ఆపేస్తే విద్యుత్తు గ్రిడ్‌పై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర విద్యుత్తు శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. దేశంలో గరిష్ఠంగా 12897 మెగావాట్ల లోడు తగ్గుతుందని అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తిని రాత్రి తొమ్మిది గంటలకు ముందు తగ్గించి మళ్లీ 9.09 గంటలకు ప్రారంభించాలని సూచించింది.

తెలంగాణలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలం జల విద్యుత్కేంద్రాల్లో రివర్స్‌ పంపింగ్‌ విధానంలో విద్యుదుత్పత్తికి అవకాశముంది. వీటిలో ఆదివారం రాత్రి 8.57 గంటలకు ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్రం సూచించింది. దీనికి సమాంతరంగా థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిస్తారు. తిరిగి సాగర్‌, శ్రీశైలంలో 9.10 గంటలకు ఉత్పత్తి తగ్గించి థర్మల్‌ కేంద్రాల్లో పెంచుతారు.

ఇంటింటా దీపాలు వెలిగించాలి: గవర్నర్‌

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిలో ప్రజలు తొమ్మిది నిమిషాల సేపు విద్యుత్తు లైట్లు ఆపివేసి, దీపాలు వెలిగించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై శనివారం కోరారు. ప్రజలు ఎక్కడా గుమిగూడరాదని, తమ ఇళ్ల ముందు లేదా బాల్కనీల్లో దీపాలు వెలిగించాలన్నారు.

వదంతులు నమ్మవద్దు: విద్యుత్‌ మంత్రి

‘దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి లైట్లు ఆపితే విద్యుత్తు వ్యవస్థకు ఏదో జరిగిపోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దు’ అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూచించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు లైట్లు స్వచ్ఛందంగా ఆపేయాలని కోరారు. అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు ఇది వర్తించదన్నారు.

సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు

అన్ని ఇళ్లలో ఒకేసారి విద్యుద్దీపాలు ఆపడం వల్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదు. తెలంగాణలోని ఇళ్లన్నింటిలో దీపాలు ఆపివేసినా 600 మె.వా. వరకూ లోడు తగ్గుతుంది. 1100 మె.వా. లోడు ఒకేసారి తగ్గినా సరఫరాకు ఇబ్బంది లేకుండా మన విద్యుత్తు పంపిణీ వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. - దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎండీ, తెలంగాణ జెన్‌కో-ట్రాన్స్‌కో

ABOUT THE AUTHOR

...view details