మహానగరంలో కాలుష్యం కాస్త తగ్గిందని ఊపిరి పీల్చుకోకముందే మళ్లీ కోరలు చాస్తోంది. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే ధూళి కణాలు దుమ్ము దులుపుతున్నాయి. పీఎం 10 తీవ్రత జూన్, జూలైతో పోల్చితే ఆగస్టులో భారీగా పెరిగినట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) తేల్చింది. ఇందుకు వాహనాల రద్దీనే కారణమని అంచనా వేస్తున్నారు.
ప్రతీరోజు గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతుంటాయి. వీటిలో ఒకటి సూక్ష్మ ధూళి కణాలు. మన తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు ఉంటే పీఎం 10 సైజు ఆ వెంట్రుకలో అయిదో వంతు ఉంటుంది. పీల్చే గాలిని ఇది కలుషితం చేసి శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 10 తీవ్రత ఘనపు మీటరు గాలిలో వార్షిక సగటు 60 ఎంజీలను దాటరాదు. అది దాటితే అక్కడ కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లే లెక్క. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 20 ఎంజీలు దాటితే అప్రమత్తం కావాల్సిందేనని హెచ్చరిస్తోంది.