రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో తెలంగాణ పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి. నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖకు నిధులు కేటాయించడంతో పాటు నూతన భవనాలను సర్కారు సమకూర్చింది. ముఖ్యంగా రాజధాని భాగ్యనగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సాంకేతికతను అభివృద్ది చేసింది. ఆధునిక పద్ధతుల ద్వారా నేర నిర్ధరణ, సాక్ష్యాల సేకరణ, నేరం జరగకుండా వివిధ శిక్షణ కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. కోట్ల రూపాలయలతో అధునాతన వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. అంతే కాకుండా శాఖలో అవినీతికి తావు లేకుండా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై దృష్టి సారించారు.
పోస్తుల భర్తీ... పటిష్ట గస్తీ...
మట్కా జూదం, పేకాట తదితర సామాజిక రుగ్మతలను ఉక్కుపాదంతో అణచివేయడానికి పోలీస్ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్ శాఖలో పోస్టులను భర్తీ చేసింది. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేయడం ద్వారా దొంగతనాలు, దోపిడీలను అరికట్టగలిగారు. డయల్ 100 ని మరింత పటిష్టం చేశారు.
మొబైల్ యాప్స్‌తో...
పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితుల నుంచి స్నేహ పూర్వక వాతావరణాన్ని ఠాణాల్లో అభివృద్ది చేశారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు పడేలా చూస్తున్నారు. కొన్నేళ్లుగా నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ అంతర్గత ఉపయోగం కోసం ఒక మొబైల్ ఆధారిత అప్లికేషన్‌ను ప్రారంభించడం వల్ల ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ శాఖలో ఉపయోగించే అన్ని ఐటీ అప్లికేషన్లు, డేటాబేస్ ఈ యాప్‌కు అనుసంధానం చేశారు. నేరం జరిగిన ప్రాంతం నుంచి సమాచారం, దృశ్యాలు యాప్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ఆన్లైన్ విశ్లేషణాత్మక నివేదికలు పొందవచ్చు. హాక్ఐ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు, అనుమానిత వాహనాల వివారనతో పాటు తదితర అంశాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూశారు. మహిళలు ప్రయాణించే వాహనం యొక్క ఫొటోను లేదా రికార్డు వీడియోను క్లిక్ చేసి, అప్లోడ్ చేసినట్లయితే అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం పోలీసులను సంప్రదించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.