తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతరిక్ష నేత్రంతో తెలంగాణలో నేర నియంత్రణ.. - crime control in Telangana

రాష్ట్రంలో నేరాలు, ప్రమాదాల నియంత్రణ, రహదారులపై రద్దీ క్రమబద్ధీకరణకు పోలీసులు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌(ట్రాక్‌) సహకారం తీసుకుంటున్నారు.

space technology to control crimes
అంతరిక్ష నేత్రంతో తెలంగాణలో నేర నియంత్రణ

By

Published : Nov 9, 2020, 7:41 AM IST

తెలంగాణ పోలీస్‌శాఖ ఆస్తులను, భూములను డిజిటలైజ్‌ చేసిన ‘ట్రాక్‌’.. తాజాగా నేర నియంత్రణకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించింది. ఈ కార్యాచరణ రూపుదాల్చితే తెలంగాణ పోలీసింగ్‌లో పెనుమార్పులు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు.

పక్కాగా స్టేషన్ల సరిహద్దుల గుర్తింపు

ఏదైనా నేరం జరిగినప్పుడు.. కొన్ని సందర్భాల్లో ఠాణాల పరిధిపై తర్జనభర్జన తప్పడం లేదు. ముఖ్యంగా రాజధానిలోని మూడు కమిషనరేట్ల సరిహద్దు ఠాణాల్లో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష సాంకేతికతను వినియోగించి రాష్ట్రవ్యాప్తంగా ఠాణాల సరిహద్దుల్ని పక్కాగా గుర్తించనున్నారు. ఇందుకు రెవెన్యూ రికార్డులను ప్రామాణికంగా తీసుకొని మ్యాపింగ్‌ చేయనున్నారు.

నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాల మ్యాపింగ్‌

నేరాలు ఎక్కువ జరిగేందుకు ఆస్కారమున్న ప్రాంతాలను జియో లొకేషన్‌ చేసి అక్కడ నిఘా విస్తృతం చేస్తారు. ఉదాహరణకు మందుబాబులు తరచూ మద్యం సేవించే ప్రాంతాల్ని జియో లొకేషన్‌ చేసి, ఆయా ప్రాంతాల్లో గస్తీ పెంచుతారు. ఈ జియో లొకేషన్‌ల మ్యాపింగ్‌ను కమిషనరేట్‌, ఎస్పీ కార్యాలయాల నుంచి పర్యవేక్షించే అవకాశం కల్పిస్తారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు

రాష్ట్రంలో ఏటా 20 వేలకు పైగా రోడ్డు ప్రమాదాల్లో 6 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వీటి నియంత్రణలో భాగంగా తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్ని జియో లొకేషన్‌ చేస్తారు. అక్కడ ప్రమాదాలు జరిగేందుకు గల కారణాలను విశ్లేషించడంతోపాటు వాటిని సరిదిద్దే ప్రణాళికను అమలు చేస్తారు. రోడ్డు ఇంజినీరింగ్‌ లోపాలతోపాటు ఇతర ప్రమాద కారకాలను గుర్తించి సరిచేస్తారు. ప్రధాన మార్గాల్లో, కూడళ్లలో ట్రాఫిక్‌ రద్దీకి కారణమయ్యే అడ్డంకులనూ జియో లొకేషన్‌ ద్వారా గుర్తించి వాటిని తొలగించే మార్గాల్ని అన్వేషిస్తారు.

ABOUT THE AUTHOR

...view details