గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా జపం చేస్తున్న పదం ‘‘సుఖీభవ.. సుఖీభవ.’’ ఏ మీమ్ చూసినా, ఏ మండపం దగ్గర డీజే విన్నా.. ఇదే మాట అందరి నోట వినిపిస్తుంది. ఓ ‘టీ’ యాడ్‌లో బామ్మ ఒకరికి టీ ఇచ్చినందుకు గానూ ఆశీర్వదిస్తూ చెప్పే మాటే ‘సుఖీభవ’. కట్ చేస్తే ఆ టీ పొడి యాడ్‌ను రీక్రీయేట్ చేశారు. గణేశ్ నిమజ్జనం రోజు ‘‘అయ్యోయ్యో.. వద్దమ్మా సుఖీభవ! సుఖీభవ!’’ అంటూ చిందులేయడం కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి దీని మీద లెక్కలేనన్ని మీమ్స్, వీడియోస్ పుట్టుకొచ్చాయి.
sukhibhava Joke meme : వద్దమ్మా.. ఆ లింక్స్‌ను క్లిక్ చేయొద్దు..! - sukhibhava meme in social media
ప్రజలకు వివిధ విషయాల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ పోలీసుల రూటే సపరేటు. సుత్తి లేకుండా సూటిగా.. ట్రెండీగా.. క్యాచీగా.. టీజింగ్ ఉంటూనే.. వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి.. నేటి తరం యువతకు సందేశాన్ని ఇవ్వడానికి ట్విటర్‌ను వినియోగిస్తున్నారు. ఆ ట్విటర్లోనూ సాధారణ ట్వీట్లు చేయరండోయ్ వీళ్లు. యువతను ఆకట్టుకునేలా.. వారికి అర్థమయ్యేలా మీమ్స్ చేస్తూ విషయమేంటో చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మీమ్స్‌తో ప్రజల్లో ట్రాఫిక్, ఇతర విషయాలపై అవగాహన కల్పించారు. ఈసారి వీళ్లు ఎంచుకున్న అంశం.. దాన్ని చెప్పడానికి వాడిన మీమ్ ఏంటో చూసేయండి మరి.

వద్దమ్మా.. ఆ లింక్స్‌ను క్లిక్ చేయొద్దు..!
ఇదే కోవలో సైబర్ మోసాలకు పాల్పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుఖీభవ స్టైల్‌లో హెచ్చరిస్తూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ మీమ్‌ను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇటీవలే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీస్- సైబర్ క్రైమ్ అవగాహన కల్పిస్తూ సాధారణంగా ట్వీట్ చేసినప్పటికీ ఇదే విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ‘సుఖీభవ’తో వైరల్ అయ్యేలా చేసింది. ఇక నెట్టింట్లో నవ్వులు పూయించిన సుఖీభవ జోక్స్ మీకోసం!