కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ప్రజలెవరూ బయటికి రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని ప్రకటించింది. ఉదయం 6 నుంచి రాత్రి 7గంటల వరకు లాక్‌డౌన్... రాత్రి 7నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం వేళ మాత్రమే నిత్యావసరాలు, అత్యావసరాల కోసం వాహనదారులు రోడ్డు మీదకు రావాలని సూచిస్తున్నారు. వారు కూడా వ్యక్తులు తాము నివసించే ప్రాంతం నుంచి గరిష్ఠంగా 3 కిలోమీటర్ల లోపే వెళ్లాలి. ద్విచక్రవాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది.
పని లేకున్నా బయటకొస్తున్నారు..!
అత్యవసర పరిస్థితిలో వెళ్లే వాళ్లు దానికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాహనదారులు ఇష్టారీతిన బయటికి వస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు దాదాపు 15వేల వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలే 13వేల వరకు ఉంటున్నాయి. కార్లలోనూ బయటికి వచ్చి రహదారులపై తిరుగుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి కెమెరాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 250 వరకు ఉన్నాయి. రోడ్లపై వాహనాలు ఎక్కువగా వస్తుంన్నందున... అలాంటి వారిపై చర్యలకు పోలీసులు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.