లాక్‌డౌన్ నేపథ్యంలో గృహహింస బారిన పడుతున్న స్త్రీలకు రాష్ట్ర మహిళా భద్రత విభాగం పోలీసులు ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గృహహింస బాధితులు ఠాణాలకు వెళ్లేందుకు అనువైన పరిస్థితులు లేనందున ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభించి నెల రోజులు పూర్తైంది. ఇప్పటి వరకు డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల్ని విశ్లేషించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత నిపుణులే బాధితురాళ్లతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారని అధికారులు తెలిపారు.
చిన్నచిన్న సమస్యలే..
లాక్డౌన్తో అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక్కడ తలెత్తే చిన్నచిన్న సమస్యలే గృహహింసకు దారి తీసుకున్నాయి. లాక్డౌన్కు ముందు భార్యభర్తల్లో ఎవరో ఒక్కరు, లేదా ఇద్దరు కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఇద్దరూ ఇంట్లోనే ఉన్నందున అహం, అనుమానపు సమస్యలు ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇటీవలి కాలంలో డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
ఇంటి నుంచి పని తెచ్చిన తిప్పలు..
నానక్ రాంగూడకు చెందిన విహహిత ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తుంది. కార్యనిర్వహణలో భాగంగా ఆమె తరచూ ఫోన్స్, చాటింగ్ ద్వారా తోటి ఉద్యోగులతో సంప్రదింపులు జరపడం భర్తలో అనుమానాన్ని పెంచింది. ఈ విషయంలో తరచూ గొడవలు జరిగాయి. భర్తలో మార్పు రాకపోయే సరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సమస్య పరిష్కారం కాలేదు. కొన్ని రోజులు తను పట్టింటికి వెళ్తానని చెప్పగ్గా పోలీసులే ఆమెను తమ వాహనంలో దింపేశారు.