రాష్ట్రంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగి పోతున్నాయి. ఈఏడాదిలో ఇప్పటి వరకు ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రూ.20 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్ల మేర సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయడంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. మాయమాటలతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ముఠాలను గుర్తించి పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది.
మాట కలిపితే.. ఖాతా ఖాళీ
‘'నో యువర్ కస్టమర్'’ పేరిట బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఖాతాదారులకు ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. క్షణాల్లో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరగడాన్ని ఆసరాగా చేసుకుని మరింత రెచ్చిపోతున్నారు. ఝార్ఖండ్‌లోని జాంతారా కేంద్రంగా, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇలాంటి ముఠాలు పనిచేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేరాలు ఎక్కువగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కేంద్రంగా జరుగుతున్నట్టు గుర్తించారు.