తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసు శాఖ ఇచ్చే ఉచిత శిక్షణ కోసం అభ్యర్థుల క్యూ

Police Jobs in Telangana : పోలీసు శాఖలో కొలువులకు నోటిఫికేషన్ జారీ అవడంతో అభ్యర్థులంతా పరీక్షలకు సన్నద్ధమవ్వడంలో తలమునకలయ్యారు. పోలీసు పరీక్షల కోసం శిక్షణ తీసుకునే వారంతా.. పోలీసు శాఖ ఇచ్చే శిక్షణ వైపే మొగ్గుచూపుతున్నారు. గతంలో వీరి వద్ద ట్రైనింగ్ తీసుకున్న వారే ఎక్కువగా ఉద్యోగాలు సాధించడంతో ఆశావహులంతా ఆ శాఖ ఇచ్చే ఉచిత శిక్షణ వైపు పరుగుపెడుతున్నారు.

Police Jobs in Telangana
Police Jobs in Telangana

By

Published : Apr 26, 2022, 10:06 AM IST

Telangana Police Department Free Training : పోలీస్‌ కొలువుల ఎంపిక కోసం ఆ శాఖ ఇచ్చే శిక్షణ వైపే ఎక్కువ మంది అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. గతంలో వీరిచ్చిన శిక్షణ తీసుకున్నవారే ఎక్కువగా ఈ ఉద్యోగాలు సాధించిన దాఖలాలుండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా దేహదారుఢ్య పరీక్షల విషయంలో ఈ శాఖలో పనిచేస్తున్న రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలే దగ్గరుండి శిక్షణ ఇస్తున్నారు. దీనికి తోడు ఉచిత శిక్షణ లభిస్తుండటం.. భోజన వసతి కలిగి ఉండటం.. స్టడీమెటీరియల్‌ ఉచితంగా దొరుకుతుండటం.. లాంటి కారణాలతో పోలీస్‌శాఖ శిక్షణ శిబిరాలకు తాకిడి పెరిగింది.

Police Job Notification in Telangana : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష మందికిపైగా దరఖాస్తులు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే వీరి నుంచి సుమారు 35వేల మందిని ఎంపిక చేశారు. మూడు నెలల ఉచిత శిక్షణకు దాదాపు రూ.35-50 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర చట్టసభల ప్రతినిధులతో పాటు కలెక్టర్లు, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్వచ్ఛందసంస్థల నుంచి ఆర్థిక సహకారం అందుతోంది.

శిక్షణార్థులకు యాప్‌ తోడు :రాతపరీక్షలకు ఉపయుక్తంగా ఉండేందుకు స్టడీ మెటీరియల్‌ యాప్‌లను సైతం పలు చోట్ల సమకూర్చుతున్నారు. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు ఇదే తరహాలో యాప్‌ను రూపొందించారు. దీనిలో 50కి పైగా పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేయడం విశేషం. ఇక్కడ 960 మంది శిక్షణ పొందుతున్నారు.

ఈ సారి ఉచిత శిక్షణలో మహిళలకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో 350 మందికి పోలీస్‌శాఖ ఉచిత శిక్షణ ఇస్తోంది. వీరిలో 120 మందికిపైగా అమ్మాయిలున్నారు. పటాన్‌చెరు కేంద్రంలో 543 మంది అభ్యర్థుల్లో 92 మంది వనితలున్నారు. సిద్దిపేట కమిషనరేట్‌కు సంబంధించి సిద్దిపేట, గజ్వేల్‌, నంగునూరు కేంద్రాల్లో 1,162 మంది అభ్యర్థులు శిక్షణలో ఉన్నారు. వీరిలో దాదాపు 400 మంది మహిళలే.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details