ఖాకీలంటే కాఠిన్యం ప్రదర్శిస్తారనేది ఒకప్పటి మాట. నేరస్థుల విషయంలోనే కఠినంగా ఉండాలి... సాధారణ ప్రజలతో స్నేహభావంగా ఉండాలన్న విధానాన్ని నేటి పోలీస్ శాఖ అవలంబిస్తున్నది. డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర పోలీస్ ఉన్నతాధికారుల మార్గనిర్దేశాలకనుగుణంగా క్షేత్రస్థాయిలో పోలీసులు ... గత నాలుగైదేళ్లుగా ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ప్రజలకు మరింత అండగా నిలిచారు. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం మార్చి 23న లాక్ డౌన్ విధించింది. ప్రజలను బయటికి రానీయకుండా... గుంపుగుంపులుగా తిరగనీయకుండా నిబంధనలు విధించింది. వీటిని తూ.చ తప్పకుండా అమలు చేస్తూ పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించారు.
సమన్వయం.. సాహసం
కరోనా వేళ బయటికి రావాలంటేనే జంకే పరిస్థితుల్లో రహదారులపైనే పలుచోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న పోలీసులు... అకారణంగా బయటికి వచ్చే వాళ్లను తనిఖీలు చేశారు. కరోనా సోకిన వాళ్లను గుర్తించేందుకు వైద్యఆరోగ్య శాఖతో కలిసి సమన్వయంగా ముందుకు వెళ్లారు. కరోనా సోకిన రోగుల చిరునామా గుర్తించి... వాళ్లను అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. రోగులతో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న వాళ్లను గుర్తించి ఆస్పత్రికి పంపించడంలో పోలీసులు ఎంతో శ్రమించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా జీహెచ్ఎంసీతో కలిసి 24గంటల పాటు పహారా కాశారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వ్యక్తులను బయటికి రానీయకుండా... బయటి వ్యక్తులను లోపటికి వెళ్లనీయకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పోలీసులకు మనోధైర్యం నింపేలా ఉన్నతాధికారులు సైతం పలు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచిస్తూ.... సి విటమిన్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లను సరఫరా చేశారు.
బాధలో బాసటగా నిలిచారు..
లాక్డౌన్ వల్ల హైదరాబాద్ మహానగరంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు మహానగరంలోని పలు ప్రాంతాల్లో పూట భోజనానికి నోచుకోలేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో పోలీసులు వలస కూలీలకు అండగా నిలిచారు. పలువురు దాతల సాయంతో కూలీలకు భోజనం, నిత్యావసర సరకులు అందించారు. క్రమంగా కరోనా ప్రభావం పెరగడం వల్ల భయపడ్డ వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో రవాణా సౌకర్యం లేక చాలామంది రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ఆందోళనకు దిగారు. వలస కూలీలను శాంతపర్చడమే గాక... వారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో వలస కూలీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానం చేరుకునే క్రమంలో కీలక భూమిక పోషించారు. సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వలస కూలీలను గుర్తించి.. ఏ సమయానికి.. ఏ రైలు.. ఏ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లాలో దిశా నిర్దేశం చేసి... ఎక్కడా ఆందోళనలు లేకుండా కూలీలను సొంత ప్రాంతాలకు చేర్చడంలో తెలంగాణ పోలీసులు సఫలమయ్యారు. అంతేకాకుండా ప్రజారవాణా లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధుతో బాధపడే వాళ్లు తరచూ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ల కోసం పోలీసులు ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేశారు. చాలాసార్లు పోలీసు వాహనాల్లోనే వారిని ఆస్పత్రులకు చేరవేశారు. వృద్ధులు, ఒంటరిగా ఉండే వాళ్లకు ఇంటికే ట్యాబ్లెట్లు, నిత్యావసర సరకులు అందించారు.