రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో దేవులపల్లి గతనెల 31న హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తుకు సారథ్యం వహించిన దేవులపల్లి రామానుజరావు సోదరుడైన ప్రభాకర్‌రావు ఉమ్మడి వరంగల్ జిల్లా, దేశాయిపేటలో వేంకట చలపతిరావు, ఆండాళ్లమ్మ దంపతులకు 1938లో జన్మించారు. వరంగల్, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు.
1960 నుంచి పలు తెలుగు పత్రికల్లో కాలమిస్టుగా పనిచేశారు. ఫీచర్ రచయితగా, అనువాదకుడిగా ఆయనకు ‘ఈనాడు’తో 20 ఏళ్ల అనుబంధం ఉంది. 1968లో రాసిన ‘మహాకవి గురజాడ జీవితచరిత్ర’ పుస్తకానికి యునెస్కో పురస్కారం లభించింది. ‘మహాకవి గురజాడ జీవితం- సాహిత్యం’ అనే గ్రంథానికి భారత ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభాకర్‌రావు 1969లో డా.మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితిలో కీలకభూమిక పోషించారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో మొదలైన తెలంగాణ ఉద్యమంలో పదునైన వ్యాసాలతో పోరాటానికి ఊపిరులూదారు. రాష్ట్రం ఏర్పడ్డాక, 2016 ఏప్రిల్ 27న తెలంగాణ అధికార భాషాసంఘాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలి అధ్యక్షునిగా దేవులపల్లి ప్రభాకరరావును నియమించారు. ఆయన ఈ పదవిలో రెండు పర్యాయాలు కొనసాగారు.
సీఎం కేసీఆర్ సంతాపం