Telangana National Unity Vajrotsavam: తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ... తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాదిపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలను భాగస్వామ్యం చేశారు. జాతీయజెండాల్ని చేతబూని ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
Telangana National Unity Vajrotsavam 2022 : చారిత్రక సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రేపు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి గాంధీ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీని... మంత్రి తలసాని శ్రీనిసవాస్ యాదవ్ ప్రారంభించారు. జాతీయజెండా పట్టుకుని ర్యాలీలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో ర్యాలీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో... ఇమాక్స్ థియేటర్ నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వరకు కొనసాగిన ర్యాలీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వివిధ కళాశాల, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 10 వేల మంది జాతీయ జెండాలను చేతపట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వరంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ర్యాలీకి పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.