తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణకు అదనపు నిధులివ్వడం కుదరదు' - amrut scheme funds 2021

అమృత్ పథకం కింద తెలంగాణకు అదనపు నిధులు ఇవ్వడం కుదరదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్​దీప్ సింగ్ పురీ స్పష్టం చేశారు. హైదరాబాద్​లో మెరుగైన మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటుకు రూ.750 కోట్లు కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనపై కేంద్ర కార్యాచరణ గురించి ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

telangana mp nama nageswara rao in parliament about amrut scheme funds
తెలంగాణకు అదనపు నిధులివ్వడం కుదరదు

By

Published : Mar 26, 2021, 6:50 AM IST

అమృత్‌ పథకం కింద తెలంగాణలోని 12 పట్టణాలను చేర్చామని, అయితే.. వాటికి ఇప్పుడు అదనంగా నిధులు ఇవ్వడం కుదరదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ తెలిపారు. హైదరాబాద్‌లో మెరుగైన మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.750 కోట్లు కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనపై కేంద్రం కార్యాచరణ చేపట్టిందా? అని తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు గురువారం లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు ఇచ్చిన స్థల అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకొందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరో స్థలంలో విమానాశ్రయ ఏర్పాటుకు అనుమతి కోరిందని, అందుకే ఇదివరకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకొందని పేర్కొన్నారు.

ఏడాది చివరికల్లా ఎయిర్‌ పోర్టుల్లో ముఖకవళికల గుర్తింపు

ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌, విజయవాడతోపాటు కోల్‌కతా, వారణాసి, పుణె, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో ముఖకవళికల గుర్తింపు(ఫేషియల్‌ రికగ్నిషన్‌) విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ తెలిపారు.

తెలంగాణలో 2017, అక్టోబర్‌ 11 నుంచి 2019, మార్చి 31 వరకు 5,15,084 కుటుంబాలకు సౌభాగ్య యోజన కింద విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌ తెలిపారు. ప్రస్తుతం కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సిన కుటుంబాలేమీ లేవని పేర్కొన్నారు.

పది జిల్లాల్లో ఫ్లోరైడ్‌, నైట్రేట్‌ ప్రభావం

తెలంగాణలోని పది జిల్లాల్లో ఫ్లోరైడ్‌, నైట్రేట్‌ ప్రభావం ఉందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. 8 జిల్లాల్లోని నీటిలో లవణ శాతం అధిక మోతాదులో ఉందని చెప్పారు. 10 జిల్లాల్లో ప్రతి లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్‌, 45 మిల్లీగ్రాములకు మించి నైట్రేట్‌ ఉన్నట్లు వెల్లడించారు.

ఆర్థికాభివృద్ధి సంస్థలపై నియంత్రణ ఉండాలి

ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా విశ్వాసాలపైనే ఆర్థికాభివృద్ధి సంస్థలను(డీఎఫ్‌ఐ) నడిపిస్తారని భావించడం చాలా కష్టమని తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ అన్నారు. ‘జాతీయ ఆర్థిక వసతులు, అభివృద్ధి బ్యాంకు బిల్లు-2021’పై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌లో సుప్రీం ధర్మాసనం ఏర్పాటుకు లా కమిషన్‌ సూచన

దక్షిణాదిలో హైదరాబాద్‌/చెన్నైలతోపాటు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఏర్పాటుచేయాలని 229వ నివేదికలో లా కమిషన్‌ సూచించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆయన గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపామని, దానిపై ఫుల్‌కోర్టు సమావేశంలో చర్చించాక.. దిల్లీ వెలుపల సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఏర్పాటుచేయడం సహేతుకం కాదని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా బండా ప్రకాశ్‌

ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా తెరాస రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ దేశ్‌ దీపక్‌వర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details