తెలంగాణ

telangana

ETV Bharat / city

Bonalu Festival : బోనాల పండుగ ఉత్సాహం.. నిబంధనల మధ్యే దర్శనం - bonalu jathara in Hyderabad

భాగ్యనగరంలో బోనాల(Bonalu Festival) సందడి అంబరాన్నంటుతోంది. మొదటి రోజే అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి.. ఆ ఆలయ కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. ఈ ఉత్సవాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

Bonalu Festival
బోనాల పండుగ ఉత్సాహం

By

Published : Jul 11, 2021, 1:19 PM IST

Updated : Jul 11, 2021, 2:07 PM IST

ఆషాఢమాస బోనాల పండుగ(Bonalu Festival)తో భాగ్యనగరం కోలాహలంగా మారింది. కరోనా వల్ల గతేడాది నిలిచిపోయిన ఉత్సవాలను ఈ ఏడు పటిష్ఠ నిబంధనలతో రెట్టింపు ఉత్సాహంతో జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజైన నేడు.. గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఆలయ కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఈ ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

గోల్కొండ నుంచి బోనాలు(Bonalu Festival)ప్రారంభించడం ఆనవాయితీ. లష్కర్ బోనాల కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తారు. బోనాల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గతేడు నిరుత్సాహ పడిన భక్తుల కోసం ఈ ఏడు పటిష్ఠ నిబంధనల మధ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పండుగలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.

- ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

ఎంతో సంతోషదాయకమైన సందర్భం ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించుకున్నాం. గోల్కొండ నుంచి మొదటి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించాం. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నగరంలోని ప్రతి ఆలయానికి నిధులు కేటాయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలి. ఈనెల 25న ఉజ్జయిని బోనాలు నిర్వహిస్తాం. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు జరుపుకుంటున్నాం.

- తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి

బోనాల పండుగ(Bonalu Festival) సందర్భంగా గోల్కొండ ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలంతా పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు.

భక్తులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని మంత్రి తలసాని సూచించారు. పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. భక్తులు.. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కు, శానిటైజర్ వాడాలని చెప్పారు.

బోనాల పండుగ ఉత్సాహం
Last Updated : Jul 11, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details